వడివడిగా.. బడి ఒడికి..

27 Jun, 2019 05:17 IST|Sakshi

సర్కారీ స్కూళ్లకు చేరిన పాఠ్య పుస్తకాలు

రాష్ట్రంలో 95 శాతానికి పైగా పాఠశాలలకు పంపిణీ పూర్తి 

7 మాధ్యమాలకు సంబంధించి 329 పీఠికలతో 2.17 కోట్ల పుస్తకాలు 

తొలిసారి స్కూళ్లు తెరిచే నాటికే పంపిణీకి ఏర్పాట్లు 

పిల్లల చేరిక పెరుగుదలతో అదనంగా 5 శాతం పుస్తకాలు 

సాక్షి, అమరావతి: విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేవి కావు. తరగతిలో 20 మంది ఉంటే.. పది మందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉండేది. మిగిలిన వారికి ఆ తరువాత ఎప్పుడో వస్తే ఇచ్చేవారు. ఒక పుస్తకాన్ని నలుగురైదుగురు కలిపి చదువుకునే పరిస్థితి. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాలు సిద్ధం చేశారు. తరగతుల్లోని ప్రతి విద్యార్థి చేతిలో అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జూన్‌ 12 నుంచి పాఠశాలలు తెరవగా.. ఇప్పటికే రాష్ట్రంలోని 95 శాతానికి పైగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. అమ్మ ఒడి పథకం, ఇతరత్రా కారణాలతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా శాఖ 5 శాతం పుస్తకాలను అదనంగా అందిస్తోంది. 

46 వేలకు పైగా స్కూళ్లు.. 39 లక్షలు దాటిన విద్యార్థులు 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ప్రస్తుతం 46,786 పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 39,04,141 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం దాదాపు రూ.96 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో రూ.65 కోట్ల వరకు నిధులను పేపర్‌ కొనుగోలు, సరఫరాకు వెచ్చిస్తుండగా మిగతా మొత్తాన్ని పాఠ్య పుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వమే పేపర్‌ కొనుగోలు చేసి ప్రింటర్లకు అందిస్తోంది. వీటి ముద్రణను ఏటా డిసెంబర్‌ లేదా జనవరి నెలల్లోనే ప్రారంభించాల్సి ఉంటుంది. గతంలో ముద్రణ టెండర్ల వ్యవహారాన్ని ఏప్రిల్, మే వరకు ఖరారు చేసేవారు కాదు. పేపర్‌ కొనుగోలు, ముద్రణ టెండర్లకు సంబంధించి లోపాయికారీ ఒప్పందాలు తేలిన అనంతరం కానీ అనుమతి వచ్చేది కాదు. గడచిన విద్యా సంవత్సరంలో ఏకంగా మే మూడో వారంలో కానీ ముద్రణ టెండర్లను ఖరారు చేయలేదు. పుస్తకాల పంపిణీకి అధికారులు నానాయాతన పడాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల విద్యాశాఖ ముందుగానే ఏర్పాట్లు చేపట్టింది. ఫలితంగా గతంలో లేనివిధంగా పాఠశాలలు తెరవటానికి ముందే పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. 

7 మాధ్యమాల్లో.. 329 పీఠికలు 
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ, ఒరియా మాధ్యమాలకు సంబంధించి 329 పీఠిక (టైటిల్స్‌)లతో 2,27,77,774 పుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ప్రింటర్ల నుంచి ఇప్పటికే 2,02,83,760 పాఠ్య పుస్తకాలు అందగా.. పాత స్టాకు 14,16,899 కలిపి మొత్తం 2,17,00,659 పాఠ్య పుస్తకాలను మండలాలకు తరలించారు. అక్కడి నుంచి గతంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వీటిని తీసుకెళ్లాల్సి వచ్చేది. దీనికి సమయం పడుతుండటంతో ఈసారి ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సుల్లో పాఠశాలలకు పంపించారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల చెంతకు 2,02,74,313 పాఠ్య పుస్తకాలు చేరాయని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరక్టర్‌ కృష్ణారెడ్డి వివరించారు. విద్యార్థుల చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు అదనంగా 5 శాతం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయిస్తున్నామని ఆయన వివరించారు. 

జిల్లాల వారీగా పాఠ్య పుస్తకాల వివరాలు 

మరిన్ని వార్తలు