ఆశలన్నీ ఆషాడంపైనే..

29 Jun, 2020 12:02 IST|Sakshi
వ్యాపారం లేక వెలవెలబోతున్న వస్త్ర దుకాణం

వస్త్ర వ్యాపారుల ఎదురుచూపులు

కనిపించని కొనుగోళ్ల సందడి

కడప కల్చరల్‌: వస్త్ర వ్యాపారుల ఆశలన్నీ ఆషాడంపైనే ఉన్నాయి. సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే వస్త్ర వ్యాపారులు ‘ఆషాడం డిస్కౌంట్‌ సేల్‌’ పేరిట తగ్గింపు ధరకు ఇస్తారు. దీంతో మహిళల నుంచి వ్రస్తాలకు మంచి డిమాండ్‌ ఏర్పడి వ్యాపారులు నాలుగు డబ్బులు కళ్లచూసే అవకాశం లభిస్తుంది. పండుగలు, వివాహాల సీజన్‌ ముగిసిన తర్వాత ఆషాడం డిస్కౌంట్‌ సేల్స్‌పైనే వస్త్ర వ్యాపారులు నమ్మకం ఉంచుతారు. వీలైనంత తక్కువ ధరకు అంతకుముందు వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం తెప్పించిన వస్త్రాలను విక్రయించి కొత్త స్టాకును తెచ్చి పెట్టుకోవాలని భావిస్తారు. అందుకే కొద్దిపాటి మార్జిన్‌ ఉన్నా వస్త్రాలను డిస్కౌంట్‌ సేల్స్‌లో ఉంచి విక్రయిస్తారు.

విక్రయాలకు లాక్‌డౌన్‌
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మంచి సీజన్‌లో వస్త్ర వ్యాపారాలు మూతపడ్డాయి. మార్చి నుంచి జూన్‌ మొదటి వారం వరకు పండుగలు, అంతకుమించి వివాహ ముహూర్తాలు ఉండేవి. దీని కోసం వ్యాపారులు కొత్తకొత్త రకాల వ్రస్తాలను పెద్ద ఎత్తున తెచ్చి స్టాక్‌ ఉంచుకున్నారు. ఊహించని విధంగా లాక్‌డౌన్‌తో వ్యాపారాలకు బ్రేక్‌ డౌన్‌ కావడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వారం, పదిరోజులు లేదా ఒక నెల మాత్రమే లాక్‌డౌన్‌ ఉంటుందని వారు తొలుత భావించినా ఆ తర్వాత వరుసగా దాదాపు మూడు నెలలపాటు దుకాణాలు మూసి ఉంచాల్సి రావడంతో అటు దుకాణ గదుల అద్దెలు చెల్లించలేక, ఇటు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేక మినిమ్‌ కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో ఆర్థికంగా కుదేలయ్యారు. 

జూన్‌ 4 నుంచి షరతులపై దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా అప్పటికే సీజన్‌ ముగిసిపోవడంతో ఆషాడ మాసం ఆఫర్లతోనైనా వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆషాడం ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా మునుపటిలా వ్యాపారాలు జరుగుతాయన్న ఆశలేవీ కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిజానికి ఎప్పటిలా ఆషాడం పేరిట వ్రస్తాలకు డిస్కౌంట్‌ ఆఫర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ అంతో ఇంతో వ్యాపారం జరుగుతుందన్న విశ్వాసంతో కొందరు వ్యాపారులు మాత్రం డిస్కౌంట్‌ ప్రకటనలు ఇస్తున్నారు.

నాడు కళకళ.. నేడు వెలవెల
సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే చిన్నా, పెద్ద వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతాయి. కొన్ని దుకాణాలు 50 శాతం వరకు ఇవ్వజూపడంతో ఆ దుకాణాల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి ఆ అవకాశం లేదు. మూడు మాసాలపాటు వ్యాపారాలు లేక నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వస్త్ర వ్యాపారులు విన్నవిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముందు ఆషాఢం ఆఫర్‌ మంత్రం పనిచేయడం లేదని, ఈ మాసం కూడా భారీగా నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశలు శ్రావణమాసంలోనేనని భావిస్తున్నారు. ఆషాడమాసం మరో మూడు వారాలు ఉంది గనుక ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకునే అవకాశం కూడా ఉందని మరికొందరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

భవిష్యత్తుపై ఆశ
ఆషాడం ఆఫర్లు ఇచ్చే పరిస్థితి పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తుపై ఆశ ఉంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా కార్మికుల జీతాలు, మెయింటెన్స్‌ ఖర్చులు వస్తే చాలనుకుంటున్నాం. శ్రావణమాసం, ఆపై వచ్చే సీజన్‌లోనైనా వ్యాపారాలు జరుగుతాయన్న విశ్వాసం ఉంది.
– దినేష్‌సింగ్, వస్త్ర వ్యాపారి, కడప

లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టం
లాక్‌డౌన్‌ను ఊహించకపోవడం, మూడు నెలలు దుకాణాలు మూసి వేయడంతో వస్త్రాల స్టాకు కొద్దిమేర పాడై నష్టం చేకూరింది. పనిలేకపోయినా బాడుగలు, కరెంటు బిల్లు, ట్యాక్సు, కారి్మకుల జీతాలు కట్టాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– చెన్నంశెట్టి మురళి, వస్త్ర వ్యాపారి, కడప

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు