పంచభూతాల వినాశకారి  టీజీ వెంకటేష్‌..

6 Apr, 2019 11:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు(అర్బన్‌) : ‘టీడీపీ నేత, ఎంపీ టీజీ వెంకటేష్‌ తాగే నీళ్లు, పీల్చే గాలి.. అన్నీ కలుషితం చేస్తున్నారు. ఆల్కాలీస్‌ ఫ్యాక్టరీతో ప్రజలు, ఇతర జీవరాశుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. కర్నూలులో విలువైన స్థలాలను ఆక్రమించుకున్నారు. అలాగే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కోట్లాది రూపాయలను చెల్లించకుండా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఆయన రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేసే రకం. ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎ

న్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ప్రశాంతంగా ఉన్న నగరంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాడ’ని వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆయన కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ  జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ గురునాథ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ధనదాహం, అధికార బలంతో తన కుమారున్ని గెలిపించుకునేందుకు టీజీ వెంకటేష్‌ తీవ్ర స్థాయిలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. నగరాభివృద్ధికి సంబంధించి ఆయన చేసింది శూన్యమన్నారు. టీజీ వెంకటేష్‌ అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 

పరిశ్రమల విద్యుత్‌ బకాయిలు రూ.50 కోట్లు చెల్లించాలి 
టీజీ వెంకటేష్‌ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వానికి రూ.50 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డారు. రాయలసీమ ఆల్కాలీస్‌ ఫ్యాక్టరీతో పాటు ఇతర పరిశ్రమలు, సినిమా థియేటర్, ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలి. ఇలా ... ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా ఉండేందుకు ఎప్పడూ తన చేతిలో అధికారం ఉండాలని కోరుకునే తత్వం టీజీది కాదా? అని హఫీజ్‌ఖాన్‌ ప్రశ్నించారు.    
మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర  
గతంలో మత విద్వేషాలను రెచ్చగొట్టిన టీజీ వెంకటేష్‌ నేడు ప్రశాంతంగా ఉన్న కర్నూలులో కూడా మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. నగరంలో అన్నదమ్ముల వలే జీవనం చేస్తున్న హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేసే వ్యక్తి టీజీ వెంకటేష్‌.

గోశాల స్థలం విషయంలో మాజీ మంత్రి రాంభూపాల్‌చౌదరి మృతికి టీజీ కారణం కాదా? అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గురవయ్యను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టింది ఆయన కాదా? ఇప్పుడు కుమారుని గెలుపు కోసం తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కాగా ... తన పేరు కలిగిన 88 ఏళ్ల హఫీజ్‌ఖాన్‌తో నామినేషన్‌ వేయించి ఎన్నికల్లో ఓటర్లను అయోమయంలో పడేసేందుకు కుట్రలు పన్నడం వాస్తవం కాదా? అని హఫీజ్‌ఖాన్‌ నిలదీశారు.   

 లీజు కట్టాల్సింది రూ.2 కోట్లు.. చెల్లిస్తున్నది రూ.87 వేలు  
నగర నడిబొడ్డున ఉన్న 1.50 ఎకరాల గోశాల స్థలానికి వాస్తవంగా నెలకు రూ.2 కోట్లను లీజుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే  టీజీ వెంకటేష్‌ మాత్రం తన అధికార బలంతో నెలకు  రూ.87 వేలను మాత్రమే చెల్లిస్తున్నారు. గోశాల పూర్తి విస్తీర్ణం 3 ఎకరాలు కాగా, ఇందులో ఆవుల నివాసం, మేత వినియోగానికి  ఎకరా వాడుకుంటున్నారు. విద్యానగర్‌ మాంటిస్సోరి పాఠశాలకు 20 సెంట్లు లీజుకు ఇవ్వగా, పాఠశాల యాజమాన్యం నెలకు రూ.25 వేలను అద్దెగా చెల్లిస్తోంది.

మరో 6 సెంట్లలో ఉన్న క్వాలిటీ హోటల్‌ ( ప్రస్తుతం ఖాళీ స్థలం)కు సంబంధించి నెలకు అద్దె రూ.43 వేలు చెల్లిస్తున్నారు. వారందరి లీజు రెంట్లను పాత వాటిని సవరించి కొత్త రేట్లను నిర్ణయించి లీజు మొత్తాన్ని పెంచారు. మరి టీజీ లీజుకు తీసుకున్న స్థలానికి ఎందుకు పెంచడం లేదు? ప్రభుత్వంతో కుమ్మక్కైనందుకే కదా ఈ ప్రతిఫలం? టీజీ ఆధీనంలో ఉన్న 1.50 ఎకరాల్లో ఖరీదైన భవనాలు నిర్మించి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. 

తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కలుషితం 
నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న తుంగభద్ర నది కలుషితమవుతోంది టీజీ వెంకటేష్‌కు చెందిన ఆల్కాలీస్‌ ఫ్యాక్టరీ వల్ల కాదా? ఆల్కాలీస్‌లో నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, పంటలు పండే భూములు..ఇలా అన్నీ  పూర్తి స్థాయిలో కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల నగర ప్రజలతో పాటు తుంగభద్ర నదికి అవతలి ఒడ్డున ఉన్న పలు గ్రామాల ప్రజలు అనార్యోగాలకు గురవుతున్నారు. పశువులు, ఇతర జీవరాశులు కూడా రోగాల బారిన పడుతున్నాయి.

పచ్చని పంటలతో కళకళలాడాల్సిన భూములు నెర్రెలు కొట్టి నిస్సారంగా మారుతున్నాయి. ఎలాంటి పంటలు పండకుండా నిస్తేజం అవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు తిరుగుబాటు చేయకుండా మభ్యపెడుతూ టీజీ పబ్బం గడుపుకుంటున్నారు. కర్నూలు నుంచి గొందిపర్ల వరకు రెండు దశాబ్దాల క్రితమే 2 కిలోమీటర్ల మేర బ్రిడ్జి మంజూరైనా, ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టకపోవడానికి ఆయన స్వార్థమే కారణం. దీనికి ఏమి సమాధానం చెబుతారు?  

క్షమాపణ చెప్పి ఓట్లడగాలి..
అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరే వ్యక్తిత్వం టీజీ వెంకటేష్‌ది కాదా? గతంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఐదు గంటల్లోనే కాంగ్రెస్‌లో చేరలేదా? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న టీజీ వెంకటేష్‌ గత 20 సంవత్సరాలుగా కర్నూలును ఎంత మేర అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. నగరంలో డ్రెయిన్లు, రోడ్లు సక్రమంగా లేవు.

దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను హరిస్తుంటే ఇంతవరకు ఏమి చేశారు? కనీసం నగర ప్రజలకు తాగునీటిని కూడా సక్రమంగా అందించలేకపోయారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ముందుగా నగర ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్‌కు ప్రజల కష్టాలు తెలుసా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడైనా ఉద్యమాలు చేశారా?   

మరిన్ని వార్తలు