తెట్టంగిలో దొంగల హల్‌చల్‌

6 Oct, 2018 07:32 IST|Sakshi
బీరువా తాళాలు తెరిచి లాకరు తాళాలు పట్టుకుపోయారని చెబుతున్న గేదెల సునీత కన్నబాబు ఇంటి సమీపంలో దొంగలు వదిలేసిన కత్తి

రెండు ఇళ్లల్లో చోరీకి యత్నం

ఓ ఇంట్లో రూ.లక్ష విలువైన నగలు, నగదు అపహరణ

శ్రీకాకుళం, వీరఘట్టం: మండలంలోని తెట్టంగి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. కత్తులతో గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. యజ్జల మల్లీశ్వరరావు, గేదెల కన్నబాబు ఇళ్లల్లో చొరబడి చోరీకి యత్నించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో  మల్లీశ్వరరావు, స్వప్న దంపతులు ఉన్న ఇంటిలోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న డబ్బాను తీసి రెండు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, రూ.10 వేలు నగదు కాజేశారు. అనంతరం పక్క వీధిలో ఉన్న గేదెల కన్నబాబు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు తెరుస్తుండగా కన్నబాబు భార్య సునీతకు మెలకువ రావడంతో కేకలు పెట్టి దొంగలను ప్రతిఘటించింది. దీంతో అక్కడి నుంచి దొంగలు పారిపోయారు. అయితే బీరువా లాకరు తాళాలు మాత్రం పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అందరూ మేల్కొని చుట్టూ గాలించారు. సుమారు 5 అడుగుల ఎత్తున నల్లగా ఉన్న వీరంతా లుంగీ తప్ప ఎటువంటి దుస్తులు లేకుండా కత్తులతో వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఓ కత్తిని కన్నబాబు ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు.

ముమ్మర దర్యాప్తు...
విషయం తెలిసిన వెంటనే వీరఘట్టం ఎస్‌ఐ జి.అప్పారావు గురువారం అర్ధరాత్రి తెట్టంగి గ్రామం వెళ్లి దొంగలు చొరబడిన గృహాలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శుక్రవారం శ్రీకాకుళం క్లూస్‌ టీం వచ్చి మల్లీశ్వరరావు ఇంట్లో సోదాలు చేసి వేలిముద్రలు సేకరించారు. దొంగలు విడిచిపెట్టిన కత్తిని పరిశీలించారు.

కేసు నమోదు చేసిన ఎస్‌ఐ...
మల్లీశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగినప్పటికీ ఆ బంగారు, వెండి నగలు తన అక్క బంగారుతల్లివని బాధితులు తెలిపారు. తన అక్క కొత్త ఇళ్లు కడుతుండడంతో వారి ఇంట్లో సామాన్లు ఉంచడానికి చోటు లేకపోవడంతో తమ ఇంట్లో నగలను భద్రపరిచారని పేర్కొన్నారు. తులం బంగారు నగలు, 5 తులాల వెండి వస్తువులు, 2 వేల నగదు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అప్పారావు విలేకర్లకు తెలిపారు.    

భయం వేసింది..
మా ఆయన డాబా మీద కంప్యూటర్‌ వర్కు చేస్తూ అక్కడే నిద్రపోయారు. నేను      పిల్లలిద్దరితో కలిసి నిద్రపోయాను. అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ నాముఖంపై టార్చిలైటు కొడుతుండగా ఇంకో వ్యక్తి బీరువా తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నల్లగా పొట్టిగా ఉన్న ఓ వ్యక్తి నా నోరు మూసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో నేను కేకలు వేసేందుకు ప్రయత్నం చేయడంతో పారిపోయారు. డాబాపై మా ఆయన బయటకు రాకుండా బయట గెడ పెట్టారు. దీంతో భయమేసింది. మా ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదుగాని మా బీరువా లాకరు తాళాలు పట్టుకుపోయారు.
– గేదెల సునీత, తెట్టంగి,వీరఘట్టం మండలం

మరిన్ని వార్తలు