తహసీల్దార్‌పై రాజకీయ వేటు

25 Sep, 2016 16:00 IST|Sakshi
తహసీల్దార్‌పై రాజకీయ వేటు
నెల్లూరు రూరల్‌ : నెల్లూరు తహసీల్దార్‌ జి.వెంకటేశ్వర్లుపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీ నేతల అడ్డగోలు అవినీతి, అక్రమాలకు అడ్డుపడున్నాడని దీర్ఘకాలిక సెలవుపై పంపించేశారు. ఆయన స్థానంలో దుత్తలూరు తహసీల్దారు వి.శ్రీనివాసులురెడ్డిని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు తహసీల్దారుగా వెంకటేశ్వర్లు ఈ ఏడాది  జనవరి 22న బాధ్యతలు చేపట్టారు. కేవలం 8 నెలలు మాత్రమే పని చేసినప్పటికీ అందరిని కలుపుకుని పోతూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే టీడీపీ నేతలకు ఆయన మింగుడు పడకుండా వ్యవహరించడంతో ఆయన్ను అడ్డుతొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మండలంలోని ఓగూరుపాడులో తెలుగు తమ్ముళ్లు నెల్లూరు రూరల్‌లో పెత్తనం చెలాయిస్తున్న నేత సాయంతో అడ్డంగా ప్రభుత్వ భూములను ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు నిక్కచ్చిగా వ్యవహరించి ఇవి ప్రభుత్వ భూములంటూ బోర్డు పెట్టించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యలు రూరల్‌ నాయకుడి ఆగ్రహానికి గురైనట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని దేవరపాళెంలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికి చెందిన ఎర్రచందనం చెట్లను మాజీ మంత్రి ఆదాల అనుచరుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి అడ్డంగా నరికి సొమ్ము చేసుకున్నాడు. ఈ వ్యవహారం గత తహసీల్దారు జనార్దన్‌ కాలంలో జరిగింది. దీనిపై తహసీల్దారు వెంకటేశ్వర్లు కఠినంగానే వ్యవహరించినట్లు తెలిసింది. దేవస్థానానికి చెందిన ఆస్తుల పరిరక్షణకు పూనుకున్నాడు. కొలతలు వేయించి హద్దులు తేల్చాడు. ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న భూములను సైతం దేవస్థానానికి అప్పగించారు. ఈ చర్యలు ఆ మాజీ మంత్రి ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది.

నెల్లూరులోని శ్రీరంగనాథస్వామి దేవస్థానానికి చెందినరూ.70 కోట్ల ఆస్తులను అధికార పార్టీకి చెందిన కబ్జాపరుల పరం కాకుండా కాపాడేందుకు పూనుకున్నారు. ఈ పరిణామం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. అధికారం ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనుకున్న తెలుగు నేతలు, తమ్ముళ్లకు తహసీల్దార్‌ కొరకరాని కొయ్యగా తయారు కావడంతో జిల్లాకు చెందిన మంత్రి నారాయణపై ఒత్తిడి తెచ్చి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లును తప్పించారు. ఆయన స్థానంలో తమకు అనుకూలమైన దుత్తలూరు తహసీల్దార్‌ను నియమించుకున్నారనే ప్రచారం జరుగుతుంది.  
మరిన్ని వార్తలు