బీసీల నమ్మక ద్రోహి చంద్రబాబు

19 Dec, 2018 10:37 IST|Sakshi
మాట్లాడుతున్న తలారి పీడీ రంగయ్య

వైఎస్సార్‌సీపీ అనంతపురం

సమన్వయకర్త తలారి రంగయ్య

అనంతపురం, గుంతకల్లు టౌన్‌: తన స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. పొదుపు సంఘాల బలోపేతం, సంఘదర్శనల పేరిట ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. సీఆర్‌పీలను టీడీపీ ఎన్నికల ప్రచారానికై వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు లేని సంఘాల బలోపేతం చంద్రబాబుకు ఇప్పుడే గుర్తుగా వచ్చిందా అని ప్రశ్నించారు. బీసీల నమ్మకద్రోహి చంద్రబాబు అని ఆయన నిప్పులు చెరిగారు.

వాల్మీకులు, రజకులు, వడ్డెర్లు, కురుబ తదితర వెనుకబడిన కులాలను ఎస్సీ,ఎస్టీ జాబితాల్లో చేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆయావర్గాల వారిని వంచించారని విమర్శించారు. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ నిధులను ఖర్చుపెట్టి ప్రజల అవసరాలను తీర్చలేని బద్దకస్తుడు ఎంపీ జేసి.దివాకర్‌రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో బీసీల ఐక్యతను చాటేందుకు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతపురం జడ్పీ బంగ్లా పూలే విగ్రహం నుండి కలెక్టరేట్‌ వరకు జరిగే బీసీల నిరసన ర్యాలీకి బీసీలు వేలాదిగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు మీసాల రంగన్న, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.రామలింగప్ప, జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, అనంతపురం మహిళా విభాగం సిటీ కన్వీనర్‌ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు