సీఎం పాలన చేస్తున్నారా! లేదా!

14 Oct, 2018 08:52 IST|Sakshi

ముంపు బాధితులను పట్టించుకున్న నాథుడే కరువు

వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం

సరుబుజ్జిలి: వంశధార నదిలో పోటెత్తిన వరద వల్ల ముంపునకుగురైన ఇళ్లు, పంటలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు నిస్సహాయులుగా రోడ్డునపడినా ఆదరించేవారు లేరని వాపోయారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారా లేదా అర్థంకావడంలేదని విమర్శించారు. వంశధార వరదల్లో చిక్కుకున్న పాలవలస, పెద్ద వెంకటాపురం, రావివలస, వీరమల్లిపేట, తురకపేట, కేజేపేట, బుడ్డివలస తదితర గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను కలుసుకొని ఓదార్చారు.

 అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ బాధిత గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, నిత్యావసరవస్తులు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందన్నారు. తుఫాన్‌ ప్రభావానికి తీర ప్రాంతాల్లో దాదాపు 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఆకలితో అలమటించి ఆర్తనాదాలు చేస్తున్నా అధికారులు ఆవైపు కన్నెత్తిచూడడంలేదని ఆగ్రహించారు. పెద్దవెంకటాపురం గ్రామంలో పంపిణీ చేయాల్సిన కొవ్వొత్తులను అధికారులు బాధితులకు అందించకపోవడంతో గాఢా«ంధకారంలో ప్రజలు మగ్గుతున్నారన్నారు. వేలాది ఎకరాల్లో వరి, చెరుకు పంటలు నష్టపోయినా అధికార యంత్రాంగాలు ఇంతవరకు పర్యటించకపోవడమేమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక, అంటువ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే ఎంపీడీఓ అడ్రస్‌ లేకుండా పోయారని ఆరోపించారు. 

అధికార యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ భజనలు చేయడంతో వరద ప్రాంతాల్లోని బా«ధితుల సమస్యలు పట్టించుకొనేవారే కరువయ్యారని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే తుఫాన్‌ నష్టం ఏర్పడినా  సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం సిగ్గుచేటని అన్నారు. ఈ పర్యటనలో ఎంపీపీ కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు, బూత్‌కమిటీల మండల ఇన్‌చార్జి మూడడ్ల రమణ, జి.వి.శివానందమూర్తి, పున్నపురెడ్డి తవిటినాయుడు, కొవిలాపు చంద్రశేఖర్, గుంట విజయ్, బెండి అప్పలనాయుడు, లావేటి విశ్వేశ్వరరావు, కరణం అసిరినాయుడు, గదిలి రమణ, వండాన కృష్ణ, పుచ్చ రాజారావు, పొన్నాడ కొండలరావు, సనపల తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు