అందుకేనా.. అంత జల్సా!

29 Oct, 2018 10:56 IST|Sakshi

చేసేది చిన్నపాటి ఉద్యోగం.. ఖర్చులేమో భారీ

శ్రీనివాసరావు వ్యవహార శైలిలో అనూహ్య మార్పులు

విశాఖ నుంచి వచ్చాక హడావుడి గ్రాండ్‌గా ఫంక్షన్లు, స్నేహితులకు పార్టీలు

అంత సొమ్ము ఎలా వచ్చిందోనని గ్రామస్తుల చర్చ

అతడి స్వరూపం తెలిసి నిర్ఘాంతపోతున్న ప్రజలు

జగన్‌పై హత్యాయత్నం కేసు నిందితుడిపై ఠాణేలంక వాసుల సందేహాలు  

శ్రీనివాసరావుది రఫ్‌ క్యారెక్టర్‌. అతడి నైజం నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో అనేక మార్పులొచ్చాయి. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం, ఇంట్లో ఫంక్షన్లు గ్రాండ్‌గా చేయడం, స్నేహితులకు పార్టీలు ఇవ్వడం గమనించా. ఉన్నపళంగా వచ్చిన మార్పులు చూశాక ఆశ్చర్యపోయాను. వైజాగ్‌ వెళ్లాక డీల్‌ కుదిరినట్టుంది. అక్కడి నుంచి వచ్చాక శ్రీనివాసరావు హడావుడి అంతా ఇంతా కాదు. అతడు చేస్తున్నది టీడీపీ నేత రెస్టారెంట్‌ కావడంతో అక్కడేదో ప్రేరేపించి ఉంటారు. ఆ డబ్బుకు ఆకర్షితుడై ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చు.
– జననేతపై హత్యాయత్నానికి ఒడిగట్టినజనుపల్లి శ్రీనివాసరావు ఇంటి దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి అభిప్రాయమిది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెద్దపెద్ద పార్టీలు, వ్యసనాలు.. ఇలా గడచిన ఎనిమిది నెలల కాలంలో జనుపల్లి శ్రీనివాసరావు వ్యవహార శైలిలో చోటు చేసుకున్న మార్పులు ఇప్పుడు అతడి స్వగ్రామం ఠాణేలంక వాసుల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన అనంతరం.. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన జనుపల్లి శ్రీనివాసరావుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేదరికంతో ఉన్న అతడి కుటుంబంలో అతి తక్కువ వ్యవధిలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చేసేది చిన్న ఉద్యోగమే అయినా అతడు చేసే జల్సాలకు, ఖర్చులకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కాక కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన అతడి వ్యవహార శైలిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోందని ఆ ప్రాంతవాసులు చెప్పుకొంటున్నారు.

గ్రామానికి మాయని మచ్చ
కోనసీమలోని ఓ మారుమూల కుగ్రామం ఠాణేలంక. ఇప్పటివరకూ అతికొద్ది మందికి మాత్రమే ఆ గ్రామం పేరు తెలుసు. జనుపల్లి శ్రీనివాసరావు పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఠాణేలంక పేరు మార్మోగిపోతోంది. ఏదో గొప్ప విషయంలో ఊరి పేరు దశదిశలా వ్యాపిస్తే ఆ గ్రామస్తులు ఎంతో సంబరపడి ఉండేవారు. కానీ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి తమ గ్రామస్తుడేనని దేశవ్యాప్తంగా తెలియడంతో తమ గ్రామంపై మాయని మచ్చ పడిందని ఈ ప్రాంత వాసులు నొచ్చుకుంటున్నారు. ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే తమ గ్రామానికి చెందిన వ్యక్తి అంత పని చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. తమ మధ్యనే ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టాడా? అని ఆశ్చర్యపోతున్నారు.

జగన్‌ అభిమాని అయితే ఇలా చేస్తాడా!
జగన్‌ అభిమాని శ్రీనివాసరావు అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ అభిమానులు, ప్రజలు కూడా విస్తుపోతున్నారు. అభిమాని అయితే ప్రాణం ఇస్తాడు కానీ తీస్తాడా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు పార్టీ అభిమాని అయితే పార్టీ నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్, రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమాల్లో ఎక్కడైనా పాల్గొనాలి. కానీ అటువంటి దాఖలాలే లేవు. అటువంటప్పుడు హత్యాయత్నానికి ఒడిగట్టిన తరువాత ఏదో ఒక ఫ్లెక్సీని సృష్టించి, అతడిని జగన్‌ అభిమానిగా చిత్రీకరిస్తూ సంఘటనను పక్కదారి పట్టిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు డ్రామా ఆడుతున్నారని స్థానికులు కొట్టిపారేస్తున్నారు.

‘దేశం’ ముద్ర పడకుండా పాట్లు
జనుపల్లి శ్రీనివాసరావు తమ పార్టీకి చెందిన వ్యక్తి అన్న సమాచా రం బయటకు రాకుండా టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నా రు. అతడికి సంబంధించి ఎటువంటి సమాచారమూ బయటకు చెప్పవద్దని అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలను గట్టిగా హెచ్చరిస్తున్నట్టు తెలియవచ్చింది. ఎవరైనా సమాచారం బయటకు చెబితే కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందని బాహాటంగా హెచ్చరించడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గృహ నిర్మాణ పథకంలో మంజూరైన ఇల్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు వ్యవహారంపై కూడా లోపాయికారీగా హెచ్చరికలు పంపించడంతో నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు.

గ్రామస్తులకు సిట్‌ భయం
సిట్‌ అధికారులు దాదాపు నాలుగు రోజులుగా ఒక్కొక్కరినీ పిలిచి విచారిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శ్రీనివాసరావు కాల్‌ లిస్టు ఆధారంగా విచారణ చేస్తుండటంతో ఎప్పుడు ఎవరిని పిలుస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ‘‘ఏదో గ్రామస్తుడు, స్నేహితుడని ఫోన్లు చేసి ఉంటాం. తనే ఫోన్‌ చేసి ఉండొచ్చు. ఇప్పుడీ హత్యాయత్నం ఘటనతో మేమంతా రోడ్డు పైకి రావాల్సి వస్తోంది. పోలీసుల ముందు నిలబడాల్సి వస్తోంది. ఏ రకంగా ఇరుక్కుపోతామో’’ అంటూ హడలెత్తిపోతున్నారు.

మరిన్ని వార్తలు