వడగాడ్పుల పంజా

13 Jun, 2014 02:18 IST|Sakshi
వడగాడ్పుల పంజా

ఒక్కరోజులోనే 67 మంది మృత్యువాత
 
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది మృతి
కోస్తాంధ్ర, తెలంగాణలో మరో రెండురోజులు ఇదే పరిస్థితి
సాధారణం కంటే 4-6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతల నమోదు

 
నెట్‌వర్క్: జూన్ రెండోవారం ముగిసిపోతున్నా ఎండలు మండుతూనే ఉన్నారుు. వడగాడ్పులు తోడవడంతో వాతావరణం నిప్పుల కొలిమి సెగను తలపిస్తోంది. గత రెండు రోజులుగా కోస్తాంధ్ర, తెలంగాణలో భానుడి తీవ్రత, వడగాడ్పులు పెరిగారుు. సాధారణం కంటే 4-6 డిగ్రీలు ఎక్కుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వడదెబ్బకు గురై గురువారం ఒక్కరోజే 67మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 62, తెలంగాణలో ఐదుగురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఉక్కబోతతో అల్లాడుతున్నారు. వేడి, వడగాలి కారణంగా రోడ్డు మీదకు అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
మరో రెండురోజులు ఇదే పరిస్థితి

కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని మెదక్, నల్లగొండ జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో గురువారం వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల 48 గంటల్లో కూడా ఆయూ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగనున్నట్టు భారత వాతావరణ శాఖ తన నివేదికలో వె ల్లడించింది. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వేడిగాలులు వీస్తుండటం, రుతుపవన గాలులు బలహీనంగా ఉండటం దీనికి కారణమని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోయింది. తీరప్రాంతాల్లో సాధారణంగా 80 శాతానికి పైగా ఉండే తేమ గురువారానికి 40-50 శాతానికి మించి లేదు. గాలిలో తేమ బాగా ఉంటే చర్మం జిడ్డుబారడం మినహా.. చెమ ట రూపంలో శరీరంలోని నీరు బయటికిపోయే పరిస్థితులు పెద్దగా ఉండవని నిపుణులు అంటున్నారు. కానీ ప్రస్తుతం తేమ శాతం తగ్గి తీవ్రమైన చెమటలతో ప్రజలు డీహైడ్రేషన్ (నిర్జలీకరణం)కు గురవుతున్నారు. వడగాడ్పులతో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. ఒక్కరోజే 67 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

స్థిరంగా అల్పపీడనం

జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను నానౌక్ ముంబైకి 940 కి.మీ. దూరంలో దక్షిణ నైరుతి దిశగా ఒమన్ తీరం వైపు పయనిస్తున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కోస్తాంధ్ర, తెలంగాణపై ఉండబోదని స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు గడచిన 24గంటల్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గరిష్టంగా 5సెం.మీ. వర్షపాతం నమోదయింది. ఆసిఫాబాద్‌లో 2, అదిలాబాద్, సిర్పూర్, మెట్‌పల్లిలో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షం కురిసిందని పేర్కొంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా