ఆ.. సౌకర్యాలుంటే చిట్టి బతికేది!

30 Nov, 2013 02:32 IST|Sakshi

 ఎంజీఎంలో కీలక సమయంలో అందని వైద్యం
 =వాస్క్యులర్ సర్జన్ లేకపోవడం..
 =అక్కరకు రాని అంబులెన్‌‌స..
 =ఏడు గంటల వృథానే కారణం

 
సాక్షి, హన్మకొండ: వేయి పడకల సామర్థ్యం, ఐదు వందల మందికి పైగా వైద్య సిబ్బంది... నెలకు రూ. 15 కోట్లకు పైగా బడ్జెట్...  ఏడేళ్ల క్రితమే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్... అయినప్పటికీ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది వరం గల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో కొడుకును కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన బానోతు చిట్టి మరణానికి రైలు ప్రమాదం ఎంత కారణమో.. ఎంజీఎంలో సౌకర్యాలు కొరవడడం కూడా అంతే కారణం. కీలక వైద్య పోస్టులు ఖాళీగా ఉండడం... అత్యాధునిక అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలే చిట్టి మరణానికి కారణమని తెలుస్తోంది.  
 
ఏడు గంటలు వృథా

వరంగల్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆమెను మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కాళ్ల మీదుగా రైలు వెళ్లడంతో నరాలు పూర్తిగా తెగిపోయి తీవ్ర రక్తస్రావమవుతోంది. ఇలాంటి సందర్భంలో శరీరం నుంచి రక్తం బయటకు పోకుండా గడ్డకట్టేలా చేసి, ఆపై శస్త్ర చికిత్స చేయాలి. ఇందుకు వాస్క్యులర్ సర్జన్ అవసరం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో తప్పకుండా ఈ వైద్యుడిని నియమించాల్సి ఉంది. ఏడేళ్లు గడిచినా నేటికీ ఎంజీఎంలో ఈ పోస్టు భర్తీ చేయలేదు.

ఫలితంగా రెండు కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావమవుతున్న బానోతు చిట్టికి ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స తప్ప మెరుగైన వైద్యం అందించలేక పోయారు. ప్రాణాలు దక్కాలంటే వెంటనే హైదరాబాద్ తీసుకుపోవాలని వైద్యులు సాయంత్రం 7  గంటల ప్రాంతంలో ఆమె బంధువులకు సూచించారు. ఈ పరిస్థితుల్లో వైద్య సహాయాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్‌కి పంపించేందుకు అవసరమైన అంబులెన్స్ సౌకర్యం ఎంజీఎంలో కరువైంది. ఎప్పుడో ఏళ్ల క్రితం నాటివి రెండు డొక్కు అంబులెన్సులే ఉన్నాయి.

దీంతో చిట్టి బంధువులు డబ్బులు సర్దుకుని ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడుకుని రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌కి పయనమయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో జనగాం దాటిన తర్వాత చిట్టి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస అందక ఇబ్బంది పడింది. తనను ఎలాగైనా కాపాడాలంటూ అంబులెన్స్‌లో ఉన్న భర్తని, బంధువులని వేడుకుంది.

అదే పరిస్థితిలో మరికొంత ముందుకు వెళ్లిన  తర్వాత రాత్రి 11 గంటలకు భువనగిరి సమీపంలో ఆమె ప్రాణాలు విడిచింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజీఎంలో చేరితే రాత్రి 10:30 గంటల వరకు ఆమెకు మెరుగైన వైద్యం అందలేదు. వాస్క్యు లర్ సర్జన్ పోస్టును భర్తీ చేసినా... కండీషన్‌లో ఉండి వెంటిలేటర్‌తో కూడిన అంబులెన్స్ అందుబాటులో ఉన్నా ఆ తల్లి బతికేది. ఇవే ఆమె మరణానికి కారణమై ముగ్గురు పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది.
 
నెలకు సగటున 20 మంది...

ఒక చిట్టి అనే కాదు...  వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎం ఆస్పత్రికి నెలకు సగటున 20 మంది రోగులు వస్తున్నారు.  వీరిలో సగం మందిని మెరుగైన వైద్యం చేయించుకోవాలంటూ నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు ఇక్కడి వైద్యులు. అలా వెళ్తున్న వారిలో చిట్టిలా మృత్యువాత పడుతున్న వారే ఎక్కువ. ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రే అరుునప్పటికీ... ఇప్పటివరకు ఇక్కడ కార్డియాలజిస్టు, న్యూరోసర్జన్, న్యూరో ఫిజీషియన్, ఎండ్రోకైనాలజీ విభాగాలకు చెందిన రెగ్యులర్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం... ఉత్తర తెలంగాణ తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎంలో వెంటిలేటర్లు మూడు మాత్రమే పనిచేస్తుండడం ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
 
 తల్లి ప్రేమకు దూరమైన పిల్లలు

 నెల్లికుదురు  మండలం ఆలేరు శివారు ఇస్రా తండాకు చెందిన  బానోతు శంకర్, చిట్టి దంపతుకుల ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి అంజలి (6), అరుణ్ (4), రోహిత్ మూడు నెలలు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  మూడు నెలల కొడుకు రోహిత్‌కు జ్వరం రావడంతో వరంగల్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రమాదంలో చిక్కుకుని మరణించడంతో ముగ్గురు పిల్లలకు తల్లి దూరమైంది.
 
 నాతో బాగానే మాట్లాడింది

 రోహిత్‌కి మూడు రోజులసంది జరం, సర్ది చేసిందని వరంగల్‌కు ఆస్పత్రికి తీస్కపోయింది. యాక్సిడెంట్ అయిందని తెల్సి సాయంత్రం ఆరున్నరకు ఎంజీఎంకు పోయినం. మంచిగనే మాట్లాడింది. పిల్లలను చూసుకుంది. అంతనొప్పిల గూడ రోహిత్ ఎట్లున్నడంటూ  చూపించేదాక పట్టుబట్టింది. ఆఖరికి అంబులెన్సు ఎక్కేటప్పుడు రోహిత్‌ను చూపించమంది. బిడ్డ తల చుట్టూ ప్రేమగా రెండు చేతులు తిప్పి దిష్టి తీసింది. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండు దాక మంచిగనే మాట్లాడింది. ఇగ బతుకుతదని అనుకున్న... కానీ ఇట్లైతదని అనుకోలే.   
- శంకర్, చిట్టి భర్త
 

మరిన్ని వార్తలు