అగ్రిగోల్డ్ పునర్నిర్మాణానికి అనుమతివ్వండి

29 Jun, 2016 01:48 IST|Sakshi
అగ్రిగోల్డ్ పునర్నిర్మాణానికి అనుమతివ్వండి

- హైకోర్టుకు ఆ కంపెనీ తరఫు న్యాయవాది ప్రతిపాదన
- తప్పక పరిశీలిస్తామన్న ధర్మాసనం
- తదుపరి విచారణ జూలై 13కు వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: తమ కంపెనీ పునర్నిర్మాణానికి అనుమతినివ్వాలని అగ్రిగోల్డ్ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది ఓ ప్రతిపాదనను హైకోర్టు ముందుంచారు. దాన్ని తప్పక పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిట్ల ఎగవేత వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగించే విషయంలో వైఖరిని వచ్చే విచారణ నాటికి తెలియజేస్తామని ఏపీ  ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో విచారణను జూలై 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సామాన్యుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ వేల కోట్లు సేకరించి మోసం చేసిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్  తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ స్పంది స్తూ, తమ వద్ద 3 ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయని, అందులో ఒకటైన కంపెనీ పునర్నిర్మాణానికి అనుమతించాలని కోరా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఖాతాదారులు చెల్లించిన మొత్తాలు పొందేందుకు మరికొంత కాలం వేచి చూడాలా? అని ప్రశ్నించింది. 2 వారాల గడువిస్తే ప్రతిపాదన వివరాలను సమర్పిస్తామని రవిచందర్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ ప్రతిపాదన వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందంటే తమకు అభ్యంతరం లేదని అంది. ధర్మాసనం, ఖాతాదారులకు వెంటనే కొంత మొత్తమైనా చెల్లిస్తేనే కంపెనీ ప్రతిపాదనలపై నమ్మకం కలుగుతుందని వ్యాఖ్యానించింది.

>
మరిన్ని వార్తలు