బెల్ట్ షాపులే లక్ష్యం!

15 Jan, 2016 02:13 IST|Sakshi
బెల్ట్ షాపులే లక్ష్యం!

జిల్లాలో సుమారు 1500 షాపులు
యథేచ్ఛగా కల్తీ మద్యం సరఫరా
లీటర్ మద్యంలో ఆరు లీటర్ల నీరు, స్పిరిట్
యనమలకుదురు ఉదంతంతో వెలుగులోకి
కట్టడికి ఎక్సైజ్ అధికారుల యత్నం

 
విజయవాడ : జిల్లాలో కల్తీ మద్యం మాఫియా తన హవా కొనసాగిస్తోంది. బెల్ట్ షాపులే లక్ష్యంగా నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. యనమలకుదురు, బందరులో నకిలీ మద్యం వ్యవహారం మరోసారి వెలుగులోకి రావటంతో ఎక్సైజ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయవాడ స్వర్ణబార్‌లో మద్యం సేవించి ఐదుగురు మృతిచెందిన ఘటనను మరువకముందే మరోమారు ఈ ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపుతోంది. జిల్లాలో గ్రామాలు మొదలుకొని విజయవాడ నగరం వరకు ఉన్న ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 35 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయనేది అధికారులకూ తెలిసిందే. వైన్ షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు దాడులు చేసి కేసుల నమోదు, అరెస్టులు చేస్తున్నా అదే తీరు కొనసాగుతోంది. జిల్లాలో 336 వైన్ షాపులకు అనుసంధానంగా సుమారు 1500 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 5,164 కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈక్రమంలో బెల్ట్ విక్రయాలు తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుంటోందని తెలుస్తోంది.
 
ట్రాక్ అండ్ ట్రేసింగ్‌లో...

వరుస ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కొంత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఎక్సైజ్ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు అన్ని బార్లు, వైన్ షాపులను తనిఖీ చేసి మద్యం బ్యాచ్ నంబర్లను పరిశీలించారు. మరోవైపు డిస్టిలరీల్లోనే ప్రతి మద్యం సీసాల నంబర్లు నమోదు చేయటంతో పాటు ప్రతి బార్, వైన్ షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేసింగ్ విధానం పెట్టి ప్రతి బాటిల్‌పై బార్‌కోడ్‌ను నోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కల్తీ కట్టడి అయ్యే అవకాశం ఉంది. ఎక్సైజ్ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కరరావు సాక్షితో మాట్లాడుతూ కల్తీ ఘటనలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, దాడులు ముమ్మరం చేస్తామని చెప్పారు.
 
కల్తీ మద్యం తయారీ ఇలా...
జిల్లాలో రెక్టిఫైడ్ స్పిరిట్ తయారుచేసే యూనిట్లు 12 వరకు ఉన్నాయి. వాటి నుంచి కొందరు అనధికారికంగా సిర్పిట్‌ను కొనుగోలు చేసి మద్యంలో కలిపి విక్రయిస్తున్నారు. జిల్లాలో మద్యం కల్తీ 1989 నుంచీ అధికంగా ఉంది. మద్యం కల్తీ రెండు రకాలుగా చేస్తుంటారు. చీప్ లిక్కర్ అయితే లీటరు మద్యంలో ఐదు లీటర్ల వరకు నీటిని కలిపి మద్యం రంగు పోకుండా చూసి, కిక్ కోసం స్పిరిట్‌ను వినియోగించి మళ్లీ డిస్టిలరీ నుంచి వచ్చిన మద్యం సీసాల మాదిరిగా స్టిక్కర్లు, ధరల లేబుళ్లు అన్నీ అతికించి ఎక్కడా అనుమానం రాకుండా విక్రయాలు చేస్తుంటారు. ఇంకో కల్తీ ఎలాగంటే.. లీటర్ చీప్ లిక్కర్‌లో ఆరు లీటర్ల నీరు, ఒక లీటర్ సిర్పిట్‌ను కలిపి సిద్ధం చేసి క్వార్టర్ సీసాలు తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇలా కల్తీ చేసిన చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌ని రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తుంటారు. దానిని పలు బ్రాండ్ల క్వార్టర్ సీసాల్లో నింపటం ద్వారా నాలుగు రెట్లు లాభాలు ఆర్జిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు