దారిదోపిడీ ముఠా అరెస్టు

13 Nov, 2014 01:23 IST|Sakshi
దారిదోపిడీ ముఠా అరెస్టు

పెదనందిపాడు: దారిదోపిడీలకు పాల్పడడమేకాకుండా.. నకిలీ బంగారం అమ్మి, మహిళలను మోసంచేసే ఐదుగురు సభ్యుల ముఠాను పెదనందిపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ టి.శోభామంజరి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం జోధ్‌పూర్  జిల్లా, భగత్‌కోటి గ్రామానికి చెందిన సోలంకి మకియా, పరమార్ శంభు, పరమార్ నందు, పరమార్ ధర్మ, సోలంకి మిధున్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నివాసం ఉంటూ.. బొమ్మలు అమ్ముకుంటూ, పాత గుడ్డలు కొంటూ ప్రజల మధ్య జీవనం చేస్తున్నట్లు నటిస్తారు.

పగటి వేళల్లో ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తూ మహిళల వద్దకు వెళ్లి ‘ మా వద్ద బంగారం ఉంది, డబ్బు అవసరమై మీకు తక్కువ రేటుకు అమ్ముతాం’ అంటూ నమ్మబలుకుతారు. వారు చెక్ చేసుకోవాడానికి మంచి బంగారం ఇచ్చి, వారు కోనేప్పుడు మాత్రం నకిలీ బంగారు ఇస్తుంటారు. ఈ విధంగా తమ వద్ద ఉన్న 11 కేజీల నకిలీ బంగారాన్ని అమ్మే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈనేపథ్యంలో గత నెల 27న పెదనందిపాడు మండలం పాలపర్రు వచ్చినట్లు సమాచారం. నకిలీ బంగారం అమ్మే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మరో అడ్డదారి పట్టారు. ఈ నేపథ్యంలో గత నెల 29న ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన గుంజి నాగేశ్వరరావు, గుంజి నాగరాజులు  జామాయిల్, సరివి తోటలు కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షల నగదు వెంట తీసుకుని ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట వచ్చారు. అక్కడ తోటల గురించి విచారించి చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు మీదుగా ద్విచక్రవాహనంపై బాపట్ల వెళుతున్నారు.

మార్గంమధ్యలో పాలపర్రు గ్రామం దాటిన తర్వాత ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుతగలడంతో వారు ద్విచక్ర వాహనం ఆపగా.. అక్కడే దాక్కొని ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వాహనాన్ని చుట్టుముట్టారు. కత్తులతో ద్విచక్ర వాహనంపై ఉన్నవారిని బెదిరించి వారి వద్ద ఉన్న రూ.5లక్షల నగదును లాక్కొని పొలాల్లో గుంటూ పరుగులు తీశారు. హఠాత్పరిణామానికి బిత్తరపోయిన బాధితులు తేరుకుని సాయంత్రం పెదనందిపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విషయమై దర్యాప్తు చేస్తున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.వీరయ్య, ఎస్‌ఐ లోకేశ్వరరావు, పోలీసు సిబ్బందికి బుధవారం పాలపర్రు పొలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల గురించి కొంతమంది సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకోవడంతో వారిని చూసి అనుమానాస్పద వ్యక్తులు పరారయ్యారు. వారిని వెంబడించి పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు.

విచారణలో వారు అసలు బంగారం చూపించి నకిలీ బంగారం అమ్మి మోసంతో డబ్బు సంపాదిస్తుంటారని వెల్లడైంది. దారిదోపిడీలు కూడా చేస్తుంటారని, ఒంటరిగా వెళ్లే వారిపై దౌర్జన్యం చేసి నగదు, బంగారు ఆభరణాలు అపహరిస్తుంటారని తేలింది. ఐదుగురు నిందితులను బాపట్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా కేసును పరిష్కరించడంలో ప్రతిభ కనబర్చిన సీఐ ఎం.వీరయ్యను, ఎస్‌ఐ ఎల్.లోకేశ్వరరావు, ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లను అభినందించారు.
 

మరిన్ని వార్తలు