ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్ట్

6 Oct, 2014 02:57 IST|Sakshi
ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్ట్

7 సవర్ల బంగారు ఆభరణాల స్వాధీనం
 
 నెల్లూరు(క్రైమ్): వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఐదో నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఐదో నగర పోలీసుస్టేషన్‌లో సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు..కలిగిరి మండలం చిన్నఅన్నలూరుకు చెందిన పల్లా మస్తాన్, గడ్డం రాజేంద్ర స్నేహితులు. దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గొలుసు దొంగతనాలను(చైన్‌స్నాచింగ్) వృత్తిగా ఎంచుకున్నారు. పల్లా మస్తాన్ తన బైక్‌కు దొంగ నంబరు వేసి దానిపై తిరుగుతూ దొంగతనాలు చేయాలని ప్లాన్ వేసి అమలు చేయసాగాడు. వీరిద్దరూ గత నెల 8న కావలి మండలం బుడంగుంట కాలనీలో రోడ్డుపై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాగారు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో సగం దండ (రెండు సవర్లు)తో వెళ్లిపోయారు. అదే నెల 16వ తేదీ రాత్రి నెల్లూరులోని రెండో నగర పోలీసుస్టేషన్ పరిధిలోని షిరిడీ సాయినగర్ ఎఫ్‌సీఐ కాలనీలో వాకింగ్ చేస్తున్న వృద్ధురాలి మెడలోని ఐదుసవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు.

 నిందితులు దొరికిందిలా..
 పొదలకూరురోడ్డు వాటర్ ట్యాంకు సమీపంలోని కృష్ణసాయి రెసిడెన్సీలో నివస్తున్న సురసుర మాధవి గత నెల 26న శ్రీ రాజరాజేశ్వరి గుడికి వచ్చారు. ఆమె అమ్మవారిని దర్శించుకుని వెళుతుండగా పోస్టల్ కాలనీ నాల్గో వీధి వద్ద మాధవి మెడలోని గొలుసును లాగేందుకు మస్తాన్, రాజేంద్ర ప్రయత్నించారు. ఆమె వెంటనే అప్రమత్తమై నిందితుల్లో ఒకరి ప్యాంటును పట్టుకుని బైక్‌పై నుంచి కిందకు లాగేసింది. దొంగ..దొంగ అని అరవడంతో అటుగా వెళుతున్న వేమూరి గోవర్ధన్, గాంధీకేషన్ నవీన్ కూడా వచ్చి బైక్‌ను కిందపడేశారు. ఊహించని పరిణామంతో ఖంగుతున్న నిందితులు బైక్‌ను వదిలేసి ఉడాయించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్న ఐదో నగర పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఎస్సై వైవీ సోమయ్య విచారణ నిర్వహించారు.

బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ దొంగదని తేలడంతో చేసిస్ నంబర్ ఆధారంగా కలిగిరి మండలం అన్నలూరుకు చెందిన పల్లా యర్రయ్యదిగా గుర్తించారు. ఆయనను ప్రశ్నించగా తన కుమారుడు మస్తాన్, అతని స్నేహితుడు రాజేంద్ర బైక్‌ను వాడుతున్నారని వెల్లడించారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం నిందితులు కొత్తూరు సబ్‌స్టేషన్ ప్రాంతంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 7 సవర్ల బంగారు నగలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన సురసుర మాధవితో పాటు గోవర్ధన్, గాంధీకేషన్ నవీన్‌ను డీఎస్పీ అభినందించారు. గోవర్ధన్‌కు బహుమతి అందజేశారు. చోరీ సొత్తు రికవరీకి కృషి చేసిన సిబ్బందికి రివార్డులు అందిచనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఎస్సై వైవీ సోమయ్య తదితరులు ఉన్నారు.



 

మరిన్ని వార్తలు