అధికారులు అలసత్వం వహిస్తే సహించం

5 Oct, 2014 02:45 IST|Sakshi
అధికారులు అలసత్వం వహిస్తే సహించం

జన్మభూమి-మాఊరులో మంత్రి పలె


 బుక్కపట్నం :
 జన్యభూమి-మాఊరు కార్యక్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించమని రాష్ట్ర సమాచార, ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం ఆయన హిందూపురం ఎంపీ నిమ్మలకిష్టప్ప, జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌లతో కలసి మండలంలోని కృష్ణాపురంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

జన్మభూమి కార్యక్రమం ద్వారా అధికారులు అంకిత భావంతో పని చేసి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. నీటి సమస్యను అధిగమించేందుకు ఉన్న నీటి వనరులను వృథా చేయరాదని పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను దశల వారీగా మాఫీ చేస్తామని, పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000కి పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పల్లె అన్నారు. ఐదెకరాలకు పైబడి భూమి ఉన్న వారికి సైతం పింఛన్ మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఇందులో భాగంగా రైతులందరికి సూక్ష్మ సేద్య పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని పలు గ్రామాలకు సత్య సాయి ట్రస్టు సహకారంతో బాబా జన్మదినమైన నవంబర్ 23న తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ అనంతపురం జిల్లాను దుర్భిక్షం నుంచి శాశ్వతంగా కాపాడాలంటే హంద్రీ-నీవా కాలువలను పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు.

జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అన్నారు. అనంతరం ముగ్గురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సర్పంచ్ నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీ రాజశేఖర్, మండల ప్రత్యేకాధికారి కృష్ణానాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కుష్‌కుమార్‌రెడ్డి, తహశీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంపీపీ రవి, ఏఓ నటరాజ్, పశువైద్యుడు చెన్నకేశవులునాయక్, డాక్టర్లు రాగిణి, కిజరున్నీషా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పలత, యాదలంకపల్లి సర్పంచ్ గంగమనాయుడు, తదితరులు పాల్గొన్నారు.



 

>
మరిన్ని వార్తలు