మూణ్ణాళ్ల ముచ్చట

5 Oct, 2013 04:11 IST|Sakshi

 నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: మన పాలకులు, అధికారులు ఆరంభశూరులనే విషయం మరోసారి రుజువైంది. నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జలపుష్పభవన్ (చేపల మార్కెట్) నిర్వహణ తీరే అందుకు నిదర్శనం. ప్రారంభంలో జలపుష్పభవన్ పలు రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారుల సందర్శనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మార్కెట్ నిర్మాణం, నిర్వహణ తీరు దేశానికే ఆదర్శమంటూ ప్రశంసల జల్లులు కురిశాయి. ఇదంతా గతం.
 
 ఆదర్శ చేపల మార్కెట్ కాస్తా అధ్వానంగా తయారైంది. పర్యవేక్షించే వారు కరువవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతుండగా కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ మంజూరు చేసిన రూ.1.20 కోట్ల నిధులతో 2011లో డైకస్‌రోడ్డులో జలపుష్పభవన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. చేపలు అమ్ముకునే వారికి 66, శుభ్రం చేసే వారికి 62  కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్ కాటా తప్పనిసరనే నిబంధన  విధించారు. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నారు.
 
 అందుకు అవసరమైన నీటివసతి కల్పించారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వడంతో వినియోగదారులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు మార్కెట్‌ను సందర్శించి స్థానిక అధికారులను ప్రశంసలతో ముంచెత్తారు. క్రమేణా దీనిపై కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సమస్యలకు నిలయంగా మారింది. దళారులు రంగప్రవేశం చేయడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడటంతో పాటు కార్పొరేషన్ ఆదాయానికి గండిపడుతోంది. చేపల వ్యర్థాలను తరలింపునకు ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా, నిబంధనలను పక్కన పెట్టి ఒక్కరికే ఆ బాధ్యతలు కట్టెబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ కాటాలు మూలనపడ్డాయి. కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే వాటిని పక్కనపెట్టి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
 
 చేపలు శుభ్రం చేసే కౌంటర్ల దగ్గర పైపులు దెబ్బతినడంతో మురుగునీరు బయటకు వెళ్లక దుర్ఘందం వెదజల్లుతోంది. పురుగులు చేరడంతో చేపలను శుభ్రం చేసేవారు ఆ కౌంటర్లను ఉపయోగించుకోలేక కింద కూర్చునే తమ పనిచేస్తున్నారు. మార్కెట్ పరిసరాల్లో  పూర్తిగా లోపించడంతో వినియోగదారులు వచ్చేందుకు జంకుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు