నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం

27 Jun, 2015 15:16 IST|Sakshi
నేటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకం

కలల్ని కబళించిన కీలలు
 నిశ్చింతతో కూడిన జీవితానికి చిరునామాగా పేరొందిన సీమ.. మృత్యుధామంగా మారి నేటికి ఏడాది. బాలసూర్యుడు తొంగి చూడడానికి ముందే.. కాలయముడు తాండవమాడి నేటికి ఏడాది. కలలు కంటున్న వారిని కీలలు కబళించి నేటికి ఏడాది. చుట్టలు చుట్టుకున్న లోహసర్పం లాంటి పైపులైన్..విస్ఫోటించి 22 నిండు ప్రాణాల్ని కాటేసి నేటికి ఏడాది. గత సంవత్సరం జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ‘గెయిల్’ పైపులైన్ పేలి విలయం సృష్టించింది. ఆ విషాదస్మృతులపై...
 
చెవులు చిల్లులు పడే విస్ఫోటంతో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా చుట్టుముట్టిన అగ్ని జ్వాలలు.. కాలిబూడిదైన పరిసరాలు, పశువులు, పక్షులు.. ఎక్కడ ఎలా ఉన్నవారు అలాగే సజీవదహనమైపోయిన మనుషులు.. తీవ్రమైన కాలిన గాయాలతో బాధితుల హాహాకారాలు, రోదనలు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున నగరం గ్రామంలో నెలకొన్న హృదయవిదారక పరిస్థితి ఇది. నాటి చేదు అనుభవాల నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు. ఆ విషాదాగ్ని రేపిన గాయాల మంటతో నగరం వాసుల గుండెలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.
 
 నగరం (మామిడికుదురు) : సరిగ్గా ఏడాది క్రితం జూన్ 27 ఉదయం 5.30 గంటలు.. ఇంకా తెలవారలేదు. నగరం గ్రామమంతా గాఢంగా నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా భారీ శబ్దం.. గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం..  క్షణాల్లో మృత్యు జ్వాలలు గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఏం జరుగుతోందో తెలిసేలోపే 16మంది ఎక్కడ ఉన్నవారు అక్కడే మృత్యుకీలలకు సజీవంగా ఆహుతైపోయారు. వీరిలో కొందరు నిద్రలోనే శాశ్వత నిద్రకు వెళ్లిపోయారు. మరో ఆరుగురు తరువాత వివిధ ఆస్పత్రుల్లో కన్నుమూశారు. మరికొందరు కాలిన గాయాలతో ప్రాణాలరచేత పట్టుకుని పరుగులు తీశారు. హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. సంఘటన జరిగిన రోజున చెట్లు చేమలు, ఇళ్లు, పశువులు, పక్షులూ అన్నీ కాలి బూడిదైపోయాయి. 17 మంది తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాల్లా మిగిలారు. ఆ రోజును తలుచుకుంటే నగరం గ్రామం ఇప్పటికీ ఉలిక్కిపడుతోంది. నాటి భయంకర జ్ఞాపకాలు నేటికీ కళ్లెదుట మెదులుతున్నాయని స్థానికులు కన్నీళ్లతో చెబుతున్నారు. పచ్చగా కళకళలాడిన గ్రామం ఎండిన మోడులా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 కాగితాలకే పరిమితమైన మోడల్ విలేజ్ హామీ
 ఈ ఘోర విషాదం తర్వాత నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ పాలకులు చేసిన హామీల హంగామా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా సర్వే నిర్వహించారు. గ్రామస్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సర్వే చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీని ఆధారంగా గ్రామాన్ని గెయిల్ చేత అభివృద్ధి చేసి మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది.  కానీ ఘోరకలి జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.
 
 విస్ఫోటంవల్ల ఏర్పడిన గొయ్యినీ పూడ్చలేదు
 పైప్‌లైన్ విస్ఫోటం వల్ల ఆ ప్రాంతంలో రోడ్డు మధ్యన సుమారు 10 అడుగుల లోతున పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనిని ఇంతవరకూ పూడ్చలేదు. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా దీనిని పూడ్చకపోవడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 రూ.6వేల వంతునే పరిహారం ఇచ్చారు
 విస్ఫోటంలో దెబ్బతిన్న 1,316 కొబ్బరి చెట్లకు రూ.8 వేల చొప్పున పరిహారం ఇస్తామని తొలుత హామీ ఇచ్చిన గెయిల్ చివరకు రూ.6 వేల చొప్పునే ఇచ్చింది. వీటితోపాటు మంటల్లో దెబ్బతిన్న 125 కొబ్బరి చెట్లకు పరిహారం ఇవ్వాలని రెండో విడత సర్వేలో నిర్ణయించారు. కానీ ఇంతవరకూ ఆ పరిహారం ఇవ్వనే లేదు. కాలిపోయిన మట్టిని తొలగించి దాని స్థానే ఉపాధి హామీ పథకంలో కొత్త మట్టి కప్పి ఇస్తామన్నారు. అదీ అమలుకు నోచుకోలేదు.
 
 మాకు జీవనోపాధి కల్పించాలి
 మా కుటుంబంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాకు ఇది పునర్జన్మ. కాకినాడ ఆస్పత్రిలో నాలుగు నెలలు చికిత్స పొంది ఇంటికి వచ్చా. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామంటున్నారు. చెన్నై రావాలని చెబుతున్నారు. నా కుటుంబానికి నేనే ఆధారం. ముందుగా మా కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తే సర్జరీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.
 - బోనం పెద్దిరాజు, బాధితుడు
 
 నా బిడ్డ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది
 విస్ఫోటంలో నాతోపాటు నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాం. నా కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరమే. వాడికి మూడు ఆపరేషన్లు చేయించారు. మరో ఆపరేషన్ చేయాల్సి ఉంది. చిన్న వయస్సు కావడంతో ఏడాది తరువాత చేస్తామన్నారు. పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత గెయిల్ తీసుకోవాలి.
 - వానరాశి దుర్గాదేవి, బాధితురాలు
 
 చాలా హామీలు నెరవేర్చాం
 బాధితులకు ఇచ్చిన హామీలను చాలావరకూ నెరవేర్చాం. నగరం ఘటనతో కేజీ బేసిన్‌లో పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను శక్తిమంతంగా చేస్తున్నాం. మధ్యకాలిక చర్యల్లో భాగంగా రూ.419 కోట్లతో 90 కిలోమీటర్ల మేర తాటిపాక-చించినాడ పైప్‌లైన్ మార్పిడి పనులు నిర్వహిస్తున్నాం. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్ల విలువ చేసే కార్యకలాపాలకు గెయిల్ ఆమోదం తెలిపింది. త్వరలో ఈ పనులు చేపడతాం. మామిడికుదురులో నిరుద్యోగుల కోసం రూ.1.35 కోట్లతో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. ప్రభుత్వాధికారుల సిఫారసు మేరకు అర్హులకు ఉద్యోగాలు ఇస్తాం. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్లు అందగానే మంటల్లో దెబ్బ తిన్న 125 కొబ్బరి చెట్లకు మరో రూ.2వేల పరిహారం చెల్లిస్తాం. నగరం, రాజోలు ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.25 లక్షలు విడుదల చేశాం. మరో రూ.25 లక్షల విడుదలకు ఆమోదం తెలిపాం. రూ.36 లక్షలతో మొబైల్ మెడికల్ వ్యాన్ ఏర్పాటు చేశాం. గెయిల్ కార్యకలాపాలపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు 80 గ్రామాల్లో బుర్రకథల ద్వారా ప్రచారం నిర్వహించాం. గతంలో ఉండే 11 అంకెల టోల్ ఫ్రీ నంబర్ స్థానే అయిదు అంకెలతో (15101) టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. వీటితోపాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాం.
 - ఎంవీ అయ్యర్, డీజీఎం, గెయిల్
 
 ఏడాదైనా అసంపూర్తిగానే..
 మలికిపురం/అమలాపురం టౌన్ : మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం జరిగి ఏడాదవుతున్నా.. అక్కడి పరిస్థితులను అటు గెయిల్ సంస్థ కానీ, ఇటు ప్రభుత్వం కానీ పూర్తిస్థాయిలో చక్కదిద్దలేదు. ఇది కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గండంగా మారింది. పైప్‌లైన్ పేలుడు తరువాత ఏడాదిలోగా అన్నింటినీ పునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరలేదు. దీనికి బాధ్యత వహించాల్సిన గెయిల్ సంస్థ కూడా అధునాతన సాంకేతిక ప్రక్రియతో పైప్‌లైన్లు పునరుద్ధరించి, గ్యాస్ సరఫరాను పెంచి, పరిశ్రమల విస్తరణకు చేయాల్సిన కృషిని కూడా విస్మరించినట్టు కనిపిస్తోంది. దెబ్బతిన్న పైప్‌లైన్లను కొంతమేర ఆధునికీకరించారు. కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
 
 విద్యుదుత్పత్తిపై పెను ప్రభావం
 నగరం పైప్‌లైన్ పేలుడు ప్రభావం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. పేలుడుకు ముందు నగరం గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) నుంచి ఈ మూడు జిల్లాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ సరఫరా అయ్యేది. పేలుడు తరువాత గ్యాస్ సరఫరాను 50 శాతం మాత్రమే పునరుద్ధరించారు. మిగిలిన 50 శాతం నేటికీ పునరుద్ధరణ కాలేదు. ఈ ప్రభావం కొత్త పరిశ్రమల ఏర్పాటుపై తీవ్రంగా పడింది. తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో మన రాష్ట్రానికి మిగులు విద్యుత్ రావడంతో ఆ ప్రభావం రాష్ట్ర విద్యుత్ రంగంపై పెద్దగా కనిపించలేదు. అదే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే నగరం విస్ఫోటం పర్యవసానానికి విద్యుత్ పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేది. నగరం నుంచి పూర్తిస్థాయి గ్యాస్ సరఫరాకు ఎంత సమయం పడుతుంది, ఏ మేరకు విద్యుదుత్పత్తి జరుగుతుందనేదానిపై గెయిల్ అధికారులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
 
 నష్టం ఇలా..
 నగరం పేలుడు అనంతరం తొలి ఆర్నెల్లూ రోజుకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నుంచి సరఫరా లేకపోవడంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు పవర్ ప్రాజెక్టులు పని చేయకుండా పోయాయి. తరువాత ఆరు నెలల్లో కేంద్రం తీసుకున్న చర్యలతో రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరాను దశలవారీగా పునరుద్ధరించగలిగారు. ఈ చర్యలతో 50 శాతం ఉత్పత్తి మెరుగు పడింది. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగాలంటే రోజుకు మరో 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా జరగాల్సి ఉంది. తొలి ఆర్నెల్ల కాలంలో ఓఎన్జీసీ రోజుకు రూ.2 కోట్ల చొప్పున రూ.360 కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. అదే సమయంలో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ కొనుగోలు చేసే గెయిల్ సంస్థ కూడా రూ.200 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు ఆ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తరువాతి ఆర్నెల్లలో రోజుకు రూ.కోటి చొప్పున రూ.180 కోట్ల మేర గెయిల్ ఆదాయం కోల్పోయింది. సరఫరా అవుతున్న గ్యాస్‌లో నీరు, మలినాలవల్ల పైప్‌లైన్లు త్వరగా పాడైపోతున్నాయని భావించి మరింత నాణ్యమైన గ్యాస్ అందించాలని ఓఎన్జీసీని గెయిల్ కోరింది. అప్పటివరకు గ్యాస్ కొనుగోలు నిలిపివేసింది. దీంతో ఓఎన్జీసీ కూడా అధునాతన మిషన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ కారణంగా ఆరు నెలలుగా 14 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయింది.
 
 మందకొడిగా పైప్‌లైన్ మరమ్మతులు
 విస్ఫోటానికి కారణమైన పైప్‌లైన్లకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మరమ్మతులు చేపట్టారు. పాత పైప్‌లైన్ల స్థానే కొత్తవి వేసే పనులకు గెయిల్ సంస్థ రూ.వెయ్యి కోట్లతో టెండర్లు పిలిచింది. పలు కాంట్రాక్ట్ సంస్థలకు ఆ పనులను అప్పగించింది. ఈ పైప్‌లైన్ పనులు జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆటంకం కలుగుతోంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు

గంటపాటు లిఫ్టులో నరకం

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌