రాష్ట్రాన్ని శ్మశానం చేశావ్

23 Mar, 2014 01:46 IST|Sakshi
రాష్ట్రాన్ని శ్మశానం చేశావ్

 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై నిప్పులు చెరిగిన వైఎస్ విజయమ్మ
 

 
 తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల్ని ఆత్మహత్యలపాలు చేసి రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ‘‘అది చేస్తా.. ఇది చేస్తానంటూ చంద్రబాబు ఇప్పుడు దొంగ హామీలిస్తున్నారు.


మరి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో బాబూ నువ్వు ఏం చేశావా అని చూస్తే.. ప్రభుత్వం ఇచ్చే జనతా వస్త్రాల పథకాన్ని తీసేసి ఆప్కోను నిర్వీర్యం చేశావు. అందులో పనిచేసే కార్మికుల ఆత్మహత్యలకు ప్రధాన కారకుడవయ్యావు. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలకొకసారో, ఆరు నెలలకొకసారో జీతాలు ఇచ్చి.. వారి కుటుంబాలను ఇబ్బందులు పెట్టావు. ఎన్‌టీ రామారావు కిలో రూ.2 కే ఇచ్చిన బియ్యం ధరను రూ.5.25కు పెంచావు. జన్మభూమి, శ్రమదానం అంటూ జనం చేతే పనులు చేయించి రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా చేశావు’’ అని విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ చేపట్టిన పర్యటన మూడో రోజు శనివారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. నంద్యాల నుంచి బండి ఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు, కరివేన, పాములపాడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు పట్టణాల్లో విజయమ్మ రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. మహానేత సతీమణిని చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ఆయా ప్రాంతాలు జనసంద్రమయ్యాయి.
 
 విజయమ్మ కన్నీరు
 స్మృతివనంలో వైఎస్ విగ్రహం వద్ద నివాళి
 గద్గద స్వరంతో ప్రసంగం



 ‘‘మనసుకు కష్టంగా అని పిస్తుంది. ఆత్మకూరును తలచుకుంటేనే ఏదోలా ఉంటుంది. ఇక్కడకు రావాలన్నా బాధేస్తోంది’’ - మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమరుడైన కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నల్లకాల్వ వద్దకు చేరుకున్నపుడు.. ఆయన సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన ఇది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆమె రాకతో ఇక్కడి ప్రజల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. బండిఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు పరిధిలోని దారుల్లో జనం బారులుతీరారు.


నల్వకాల్వలో రెండు నిముషాలు మాట్లాడాలని స్థానికులు పట్టుబట్టడంతో మైక్ అందుకున్న ఆమె కొంత సేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ ప్రాంతమంతా మూగబోయింది. కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. తేరుకున్న స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ పాలనను గుర్తు చేస్తూ.. ఆయన తదనంతర పాలనను ఎండగడుతూ..  మాట్లాడారు. స్మృతివనంలోని మహానేత భారీ విగ్రహం వద్ద ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. బండిఆత్మకూరు, వెలుగుడులో గద్గద స్వరంతో మాట్లాడిన తీరు అందరినీ కలచివేసింది.
 
 

>
మరిన్ని వార్తలు