కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు...

16 Nov, 2016 02:46 IST|Sakshi

‘విశాఖ’ అటవీ భూముల మార్పిడిపై వివరణ కోరిన హైకోర్టు

 సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న చింతపల్లి తదితర అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్పిడి చేసిన వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో అటవీయేతర భూములుగా మార్చిన వాటిని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించలేదన్న ప్రభుత్వ నివేదనను నమోదు చేసింది.

అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్పిడి చేసి, వాటిని బాకై ్సట్ తవ్వకాలకోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు అప్పగించడంపై స్వచ్ఛంద సంస్థ శక్తి అధ్యక్షుడు పి.శివరామకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) డి.రమేశ్ స్పందిస్తూ.. అటవీయేతర భూములుగా మార్చినప్పటికీ, వాటిని ఏపీఎండీసీకి ఇంకా అప్పగించలేదని, ప్రస్తుతానికి అప్పగించే ఉద్దేశం కూడా లేదని తెలిపారు. అటవీ భూముల్ని అటవీయేతర భూములుగా మార్చి ఏడాది కావొస్తోందన్నారు. ఈ విషయాలను ధర్మాసనం నమోదు చేసుకుంది. పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యల వల్ల స్థానిక గిరిజనుల హక్కులకు విఘాతం కలుగుతోందన్నారు. గ్రామసభల తీర్మానాలను పట్టించుకోలేదని తెలిపారు. మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలేవీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కౌంటర్లు దాఖలు చేశాక అన్ని అంశాలను లోతుగా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణను వారుుదా వేసింది.

>
మరిన్ని వార్తలు