గజిబిజి పంపిణీ

11 Apr, 2016 01:12 IST|Sakshi

అస్తవ్యస్తంగా పౌర సరఫరాల శాఖ

సరుకుల పంపిణీలో స్పష్టత లేక డీలర్లు, లబ్ధిదారుల అవస్థలు
ఈ-పోస్‌పై ప్రజల పెదవివిరుపు
తమిళనాడు తరహా వేతనాల కోసం డీలర్ల డిమాండ్
త్వరలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

 

విజయవాడ బ్యూరో : ప్రయోగాలు.. సంస్కరణలతో ప్రభుత్వ ప్రజాపంపిణీ విధానం అస్తవ్యస్తంగా మారింది. చౌకబియ్యం పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం రోజుకో నియమం పెడుతూ ప్రజలు, డీలర్లను అయోమయానికి గురిచేస్తోంది. డీలర్లపై ఒత్తిడి పెంచడంతోపాటు వినియోగదారులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావాల్సిఉండగా వాయిదా పడింది. డీలర్ల వేతనం, కమీషన్ అంశాలపై అధ్యయనం చేయడంతోపాటు ప్రజాపంపిణీ విధానంలో లోపాలపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ సరుకుల పంపిణీ పూర్తికావాలని సివిల్ సప్లయిస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. నెల మొదటి వారంలోనే రేషన్ పంపిణీ పూర్తికావాలంటూ జిల్లా అధికారులు డీలర్ల మెడపై కత్తిపెట్టారు. దీంతో పలు జిల్లాల్లో డిపోల ద్వారా ఇచ్చే సరుకుల గడువుపై చాటింపులు కూడా వేయించారు. కృష్ణా జిల్లాలో ఏడో తేదీ వరకు సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు.  తాజాగా వారం రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తిచేయని డీలర్లకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ ఈ నెల 15 వరకు గడువు  పొడిగించారు. ఇలా పేదలను, డీలర్లను అయోమయానికి గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో నెలాఖరు వరకు సరుకులు ఇచ్చే వారని, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు తెచ్చుకునేవారమని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అప్పోసొప్పో చేసి కొందరు సరుకులు తెచ్చుకోగా ఇంకొందరు ఇంకా బియ్యం తెచ్చుకోలేక వదిలేసుకున్నారు. ఇదంతా మిగులు అని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.

 
బాలారిష్టాలు దాటని ఈ-పోస్

రాష్ట్రంలోని ప్రజాపంపిణీ డిపోల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం ఏడాదైనా ఇంకా బాలారిష్టాలు దాటలేదు. సకాలంలో సరుకులు రాక, సర్వర్లు మొరాయించడంతో గంటలు, రోజుల తరబడి క్యూల్లో నిల్చోలేక పలువురు సరుకులు వదులుకోవాల్సి వస్తోంది. గతేడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ఈ-పోస్ విధానం క్రమంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు విస్తరించారు. ఈ విధానం అమలులోకి తెచ్చిన తొలి రెండు నెలల్లో ఏకంగా 24 శాతం బియ్యం, నిత్యావసర సరుకులు మిగులు కనిపించడంతో ప్రభుత్వం అందంతా మిగులు అని భావించిందే తప్ప వినియోగదారుల చెంతకు సరుకులు వెళ్లడం లేదని విషయాన్ని గుర్తించలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రమంతటా చౌకడిపోల్లో ఈ విధానం అమలు చేయడంతో నెలకు సగటున 16 శాతం సరుకులు మిగిలిపోతున్నాయంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది.

 
మంత్రివర్గ ఉపసంఘం భేటీ వాయిదా

డీలర్ల విజ్ఞాపనలు పరిశీలించి ఒక విధానం రూపొందించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం విజ యవాడలో జరగాల్సి ఉండగా వాయిదాపడింది. డీలర్లకు కమీషన్ కమీషన్ ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? జీతం ఇవ్వాలా? ఎన్ని రోజులు పని చేయించాలి? వంటి అంశాలను ఉపసంఘం పరిశీలించి ప్రభుత్వానికి నివేది స్తుంది. కమిటీలోని యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత డీలర్ల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు.   రాష్ట్రంలోని రెండు డీలర్ల సంఘాల ప్రతినిధులు, అన్ని జిల్లాల డీలర్ల సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయవాడ సమావేశానికి రావాలంటూ సమాచారం పంపించారు.

 

 

మరిన్ని వార్తలు