సామాన్యుడికి ధరాఘాతం

30 Dec, 2013 00:41 IST|Sakshi

 ఏడాదిలో పదిసార్లు పెరిగిన పెట్రోలు ధరలు.. 14 సార్లు పెరిగిన డీజిల్ ధరల మోతలతో మధ్యతరగతి జీవి విలవిల్లాడిపోయాడు. సన్న బియ్యం రేట్లు చుక్కలు చూపించాయి. వంట నూనెల ధరలు సలసలా కాగి పేదోడి కుంపట్లో నిప్పులు రాజేశాయి. ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 700శాతం పెరిగిన ఎరువుల ధరలు రైతులను కోలుకోలేని విధంగా అప్పుల పాల్జేశాయి. ఏ వస్తువు కొందామన్నా.. షాక్ కొట్టే విధంగా ఉన్న ధరల్ని చూసి ఈ ఏడాది సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా సమ్మె కాలంలో నిత్యావసరాలు చుక్కలు చూపాయి. ధరల నియంత్రణకు నడుం బిగించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ఏ మాత్రం కనికరం చూపలేదు. చేసేదేమీ లేక చేష్టలుడిగిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జిల్లావాసులు  మోయలేని భారం మోశారు.  
 
 ఆర్టీసీ కస్సు ‘బుస్సు’
 ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణీకులపై చార్జీల రూపంలో అదనపు భారం వేసిన ఆర్టీసీ.. జూన్ నెలలో టోల్ ట్యాక్స్ బాదుడుతో బెంబేలెత్తించింది. ఏడాదికి రూ.75 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో భాగంగా ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపింది. సమైక్యాంధ్ర ఉద్యమం ముగిశాక, మరోసారి చార్జీలు పెంచి పెరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసింది. కిలో మీటరుకు 30 నుంచి 50 పైసల వరకు చార్జీలను పెంచి సగటున నెలకు రూ.12 లక్షల అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు రీజియన్ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు.
 
 రైతన్నకు ఎరువుల ధరాఘాతం
 కనీవినీ రీతిలో ఎరువుల ధరలు రైతన్న వెన్ను విరిచాయి. దీంతో పాటు సమైక్య సమ్మె ప్రభావంతో ధరలు ఆకాశాన్నంటాయి. 50 కిలోల యూరియా బస్తా రూ.284కు అమ్మాల్సి ఉంటే, రూ.350 చొప్పున అమ్ముకున్నారు. మిగిలిన ఎరువులు రూ.50 నుంచి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయించారు. సుమారు 700 శాతం మేర ఎరువుల ధరలు పెరిగి అన్నదాతలకు అప్పులు మిగిల్చాయి. నియంత్రించాల్సిన అధికార గణం పట్టనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు చెప్పిందే రేటు.. అన్నట్లు సాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు చుట్టుముట్టి పెట్టిన పెట్టుబడికి తోడు ఎకరాకు రూ.20 వేల అప్పు మిగిలింది.
 
 కరెంటు నిల్లు... బిల్లు ఫుల్లు...
 గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు చుక్కలు చూపించాయి. లేని కరెంటుకు మూడింతలు కరెంటు బిల్లులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కరెంటు చార్జీలు 60 శాతానికి పైగా పెరిగాయి. జిల్లావాసులపై పెరిగిన కరెంటు బిల్లుల భారమే నెలకు రూ.101.69 కోట్లకు పైగా ఉంది. సర్దుబాటు చార్జీల పేరిట గడిచిన రెండేళ్లకు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. నెలకు సర్దుబాటు చార్జీల భారం రూ.30 కోట్లకు పైగా ఉంది. పరిశ్రమలకు మూడురోజుల పాటు పవర్ హాలిడే అమలు చేయడంతో జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పలు రకాల ఉత్పత్తులు నిలిచిపోయాయి.
 
 నిత్యావసరాలు ప్రియం..
 ఈ ఏడాది సన్న బియ్యం, వంట నూనెలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. సన్న బియ్యం మరింత ప్రియం అయ్యింది. ఏడాది ప్రారంభంలో కేజీ రూ.35-రూ.40 వరకు ఉన్న సన్న బియ్యం సమ్మెకు ముందు రూ.50 కి చేరింది. సమ్మె కాలంలో రూ.60 వరకు పలికింది. వంట నూనెల్లో పామాయిల్ మంటలు మండింది. రూ.75వరకు ధర పలికింది. వేరుశనగ మొన్నటివరకు రూ.110కి చేరింది. నిత్యం అవసరమైన కూరగాయలు, ఆకు కూరలు మధ్యతరగతి వర్గాలకు దడ పుట్టించాయి. టొమాటో మొదట్లో కేజీ రూ.5 ఉన్న ధర ఏకంగా కేజీ రూ.40కి చేరింది. అల్లం అల్లాడించగా, బీన్స్ ధరలు పెరిగాయి. క్యారట్ రూ.12 ఉన్న ధర రూ.26 వరకు పలికింది. రూపాయి ములక్కాయ ధర రూ.పదికి చేరింది. కార్తీక మాసంలో కూర‘గాయాలు’ చేశాయి.
 
 గ్యాస్ ‘బండ’ పడింది..
 గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారుడిని గందరగోళానికి గురి చేసింది. ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. రాయితీ సిలిండర్ ధర రూ.412 నుంచి రూ.600కి చేరింది. నెలకు వినియోగదారులపై సుమారు రూ.20 కోట్ల భారం పడింది. వంట గ్యాస్‌కు ఆధార్ లింకేజీతో సిలిండర్‌కు వినియోగదారులు రూ.1,017 చెల్లించారు. బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన డబ్బు జమ కాకపోవడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు.
 
 పెట్రో వాత.. డీజిల్ మోత..
 పదిసార్లు పెట్రోలు చార్జీలు పెంచి పథ్నాలుగు సార్లు డీజీల్ మోత మోగించిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వినియోగదారుడి జీవిత చక్రానికి బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 220 పెట్రోలు బంకు ఔట్‌లెట్లు ఉన్నాయి. రోజుకు డీజిల్ 27 లక్షల లీటర్ల వినియోగం జరుగుతుండగా, పెట్రోలు 9 లక్షల లీటర్ల వినియోగం జరుగుతున్నట్లు అంచనా. పెట్రోలు జనవరిలో రూ.73.20 ఉంటే, ప్రస్తుతం రూ.77.40 వరకు ఉంది. అంటే లీటరుకు రూ.4.20 వరకు పెరిగింది. రోజుకు పెట్రోలు భారం రూ.3.78 లక్షలు పెరిగింది. డీజిల్ జనవరిలో రూ.52.60 ఉంటే ప్రస్తుతం రూ.58.40 ఉంది. లీటరుకు రూ.5.80 వరకు పెరిగింది. రోజుకు జిల్లాలో డీజిల్ భారం రూ.15.66 లక్షల వరకు ఉంది.
 
 ఉల్లి లొల్లితో కంట కన్నీరు..
 ఉల్లి ధరలతో ప్రభుత్వాలనే గడగడలాడించింది. ఈ ఏడాది అక్టోబరులో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మహారాష్ట్ర, నాందేడ్, కర్ణాటకలలో పంట తుడిచిపెట్టుకుపోవడం, స్థానికంగా తుపాన్లుతో పంట దెబ్బతినడంతో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు కేజీ రూ.వందకు చేరాయి. సమ్మెకాలంలో రూ.120కి చేరుతుందని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా ధర లేక రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పుడు కేజీ రూ.8కి కొంటామని వ్యాపారులు రైతుల వద్ద బేరాలు చేస్తుండటంతో ఉల్లి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

మరిన్ని వార్తలు