పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు... ఒక్క రోజులోనే బిల్లుల చెల్లింపు

24 Nov, 2013 07:11 IST|Sakshi

కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్:  జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఒక్క రోజులోనే బిల్లులు చెల్లిస్తున్నట్టు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ తెలిపారు. ఆయన శనివారం కొత్తగూడెంలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో బిల్లులు రావడానికి 25 రోజులు పట్టిందన్నారు. ఈ జాప్యాన్ని ప్రస్తుతం పూర్తిగా తొలగించామన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులు బిల్లు కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు తమ పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌సీ కోడ్ నంబర్ సరిగా ఉన్నాయా లేదో సరిచూసుకోవాలన్నారు. ఇవి సక్రమంగా ఉన్నట్టయితే.. గృహ నిర్మాణ శాఖ డీఈలు బిల్లులు జనరేట్ చేసిన 24 గంటల్లో బ్యాంక్ అకౌంట్‌లో నేరుగా చేరతాయని అన్నారు.

 జిల్లాలో నాలుగు నిర్మిత కేంద్రాల ద్వారా ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4.23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వీటిలో 2.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వీటికిగాను 881 కోట్ల రూపాయలు చెల్లించామని అన్నారు. ఇప్పటివరకూ నిర్మాణం చేపట్టని ఇళ్లు లక్ష వరకు ఉన్నాయని, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి బడ్జెట్ లోపు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ కింద 21,758 మరుగుదొడ్లు మంజూరైనట్టు, వీటిని మండలానికి 500 చొప్పున కేటాయించినట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ తీర్మానిస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరవుతాయన్నారు.

 కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాలలో లబ్ధిదారుల సంరక్షణ కేంద్రం (బెనిఫీషియర్స్ కేర్ సెంటర్) ద్వారా వారి (లబ్ధిదారుల) సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని అన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇసుక కూపన్లను స్టేజీవారిగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అవకతవకలకు పాల్పడిన అధికారులు, వర్క్ ఇన్‌స్పెక్టర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు