ఎందుకిలా? ప్రాణం విలవిల..

20 Jan, 2016 01:43 IST|Sakshi
ఎందుకిలా? ప్రాణం విలవిల..

►‘ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్య ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండడం కంటే మరణంలోనే నాకు ఆనందం ఉంది.. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది.. నా చిన్ననాటి నుంచి ఒంటరితనానికి దూరం కాలేకపోయాను.. మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను..’ ఇది ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం!       

►అమ్మకు ఎవరో చేతబడి చేశారని నాన్న నమ్మకం. ఆ అనుమానమే తల్లీ పిల్లలకు కలిగింది. బీటెక్ చదువుకున్న కొడుకు భువనేశ్వర్ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఇంటికొచ్చేశాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న పెద్దకొడుకు అనుమానాన్ని పెనుభూతంగా చేసుకుని ఏడాదిన్నర క్రితం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మూడు రోజుల దాకా ఆ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంట్లోనే ఉంచేశారు. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగూ ఆరా తీస్తే కొడుకు చనిపోతే వాసన రాదా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అయిన వారందరికీ దూరమయ్యారు. ఒంటరితనంతో గడుపుతున్నారు. ఆ తర్వాత కూడా ఆ ఇంటిని ‘భూతం’ వదల్లేదు. ఆదాయం వచ్చే పనిని తండ్రి వదిలేసుకున్నాడు. చేతబడిపై నమ్మకం చావని ఆయన మాంత్రికులు, తాయెత్తుల కోసం ఊళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో తల్లీకొడుకులిద్దరూ ఉరేసుకుని ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఇది విశాఖ నగరం అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో రెండ్రోజుల క్రితం తనువు చాలించిన కమల, రవికుమార్‌ల విషాదగాధ!                - సాక్షి, విశాఖపట్నం
 
► పై ఘటనల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు నిరక్షరాస్యులు కాదు.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అంతకంటే కాదు.. మహానగరాల్లో ఉంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారూ.. సమాజంపై అవగాహన ఉన్నవారూ. ఇలాంటి వారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం, అందుకు దారితీసే పరిస్థితులను మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇలా విశ్లేషిస్తున్నారు.
 
ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులివీ
►తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో డిప్రెషన్.
► తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమాభిమానాలు పొందలేకపోవడం
►విడిగా జీవించడం, సర్దుబాటు చేసుకోలేక పోవడం
►మానసిక, ప్రవర్తనలో అపసవ్యత
►అతి గారాబం, అతి నియంత్రణ
►చదువులో సరైన క్రమశిక్షణ లేకపోవడం
►ఎవరితోనూ కలవలేక ఒంటరిగా ఉండడం.
► ఇతరులకన్నా తక్కువన్న న్యూనత, భవిష్యత్‌పై నిరాశ
►సమాజ ం దూరంగా ఉంచడం..
 
గత సంఘటనలూ ప్రభావితం..

 ఆత్మహత్యలకు గతంలో జరిగిన ఘటనలూ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని..
►{పేమ విఫలం, చిన్ననాటి దుర్ఘటనలు, ఆత్మీయులను కోల్పోయిన ఘటనలు మర్చిపోలేకపోవడం.
►మహిళల్లో అబార్షన్లు, పిల్లలు కలగరన్న నిర్థారణకు రావడం. ఆస్తులు కోల్పోయినప్పుడు..
►అత్తమామల వేధింపులు, పరీక్షల్లో ఫెయిల్ వంటివి తనువు చాలించాలనుకుంటారు.
 
అలాంటి వారిని గుర్తించవచ్చు..
ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.
►ఎప్పుడు రెస్ట్‌లెస్‌గా, అసహనంగా ఉంటారు. అన్నీ తెలిసినట్టు కనిపిస్తారు. దేనిపైనా ఆసక్తి చూపరు. తిరస్కార భావంతో ఉంటారు. ఎవరి సలహాలు తీసుకోరు.
►ఎక్కువగా భయపడతారు.. నిద్రపోరు. చెప్పిందే చెబుతారు.. చేసిందే చేస్తుంటారు.  
 ఈ లక్షణాలున్న వారిని వారి తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు, సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులు గుర్తించగలుగుతారు.
 
మాకెందుకులే అనుకోరాదు..
మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి పట్ల వారి కుటుంబ సభ్యులే కాదు.. సాటి మనుషులు మాకెందుకులే అని ఊరుకోవడం సరికాదు. సమాజం కూడా స్పందించాలి.  సైన్స్ అభివృద్ధి చెందుతున్నా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చెడుపు, చిల్లంగి వంటి  మూఢనమ్మకాలు కొనసాగడం విచారకరం. ఇలాంటి రుగ్మతలతో ఉన్న వారిని సరైన సైకాలజిస్టుకు చూపిస్తే తిరిగి మామూలు మనుషులుగా మారతారు. సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్, అక్కయ్యపాలెంలోని కమల, రవికుమార్‌ల వంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు వేసే కమిటీల్లో మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులకు స్థానం కల్పించాలి.
 -ప్రొఫెసర్ ఎం.వి.ఆర్.రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి.
 
స్కిజోఫినియా అయి వుండొచ్చు..
అక్కయ్యపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల పరిస్థితి చూస్తే స్కిజోఫినియాగా అనిపిస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మూఢనమ్మకాల నుంచి బయటపడలేక మానసిక బలహీనత, అపోహలతో అయిన వారికి, చుట్టుపక్కల వారికీ దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నట్టు అర్థమవుతోంది. తల్లి అనారోగ్యం వారిపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఇలాంటి సమస్య వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉండొచ్చు. జన్యుపరంగా కూడా ఇలాంటి రుగ్మత వస్తుంది. ఈ సమస్యకు మానసిక వైద్యులు చికిత్స చేసి నయం చేస్తారు. బంధువులు, స్నేహితులు ఆ బాధ్యతలు తీసుకుంటే ఫలితం ఉండేది. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వారిని వదిలేయకుండా తగిన వైద్యం చేయించాలి.                -డాక్టర్ కె.నరసింహారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు
 
ఇవీ పరిష్కారాలు..
►నమ్మిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి.
► సైకాలజిస్టులు/సైక్రియాట్రిస్టులను సంప్రదించాలి.
►సానుకూల దృ క్పథంతో మసలుకోవాలి. ఆవేశాలను అణచుకోవాలి.
►తల్లిదండ్రులు ప్రేమానురాగాలు పంచాలి. పిల్లలకు దన్నుగా నిలవాలి. పెద్దలపట్ల ఆదరణ పెరగాలి.
►మానసిక సమస్యలు గల విద్యార్థినీ, విద్యార్థుల పరిస్థితిని వారి గురువులు గుర్తించి సరిదిద్దవచ్చు.
►వారు రోజూ స్కూలు/కాలేజీలకు వస్తున్నారా? లేదా? నలుగురితో కలుస్తున్నారా లేదా? గమనించాలి. హాస్టళ్లలో ఉంటున్న వారిని పట్టించుకునే బాధ్యత వార్డెన్లు తీసుకోవాలి.
 
 

మరిన్ని వార్తలు