బిల్డర్ల ముందుచూపు!

17 Jan, 2016 01:30 IST|Sakshi

ఫ్లాట్ విలువలో సగం చెల్లించాకే నిర్మాణం
‘రియల్’ బూమ్ లేకపోవడంతో ముందు జాగ్రత్త
ముందుగానే అంత  ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్న     కొనుగోలుదారులు
ఆ మొత్తాన్ని వదిలేసుకుంటే తమ పరిస్థితేంటంటున్న  బిల్డర్లు

 
విజయవాడ, గుంటూరు, పరిసర ప్రాంతాల్లో అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఫ్లాట్ నిర్మాణంలో సగం మొత్తాన్ని నిర్మాణానికి ముందుగానే డిమాండ్ చేస్తున్నారు. రాజధాని నేపథ ్యంలో నివేశన స్థలాలు, వ్యవసాయ భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు నమ్మి రియల్టర్లు, ధనికులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. సీఎం పేర్కొన్న విధంగా నివేశన స్థలాలు, వ్యవసాయ భూముల ధరలు పెరగకపోవడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. రియల్టర్లలా కాకుండా బిల్డర్లు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు..
 
గుంటూరు : వచ్చే జూన్ నాటికి హైదరాబాద్‌లో ఉన్న రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులంతా రాజధానికి చేరుకుంటారని ప్రచారం సాగుతోంది. కనీసం 50 వేల మంది కొత్త వ్యక్తులు రాజధానికి వస్తారనేది అంచనా. దీనికి అనుగుణంగా బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నివేశన స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసి నష్టపోయిన రియల్టర్ల వలే కాకుండా అపార్టుమెంట్ల ధరలో 50 శాతం అడ్వాన్సుగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాల ప్రారంభ దశలోనే సగం ఎలా చెల్లిస్తామని కొనుగోలుదారులు ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్న స్థాయిలో రాకపోతే అపార్టుమెంట్ల నిర్మాణాలకు చెల్లించిన స్వల్ప మొత్తాలు మీరు వదిలేస్తే మా పరిస్థితేంటని బిల్డర్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. సీఎం చెబుతున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధానికి తరలిరాకపోతే లక్షలు వ్యయంతో కొనుగోలు చేసిన అపార్టుమెంట్లను అద్దెకు తీసుకునే వారుండరనే ఆందోళనను కొనుగోలుదారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలు అటు కొనుగోలుదారులు, అమ్మకందారుల నుంచి వ్యక్తమవుతుండటంతో అనుకున్న స్థాయిలో అపార్టుమెంట్ల అమ్మకాలు ఊపందుకోలేదు.

పెరిగిన అపార్టుమెంట్ల నిర్మాణాలు..
అమరావతి రాజధాని నేపథ్యంలో ఏడాది నుంచి విజయవాడ, గుంటూరులో అపార్టుమెంట్ల నిర్మాణాల్లో వేగం పెరిగింది. వచ్చే జూన్ నుంచి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధానికి తరలిరానున్నారని, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుందనే ప్రచారం ఎక్కువుగా సాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు విజయవాడ, గుంటూరుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ భవ నాలు అద్దెకు తీసుకుంటున్నారు. మంత్రులు నాగార్జున యూనివర్సిటీకి సమీపంలోని అపార్టుమెంట్లు, విల్లాలు అద్దెకు తీసుకుంటున్నారు. అపార్టుమెంట్లకు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల నుంచి నూతన బిల్డర్లు రంగ ప్రవేశం చేశారు. స్థానిక బిల్డర్లతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద నిర్మాణ సంస్థలు విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా చేసుకుని కార్యాలయాలు ప్రారంభించాయి. ఉన్నతాధికారులు, వ్యాపారులు, రాజకీయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పెద్ద సంస్థలు అధునాతన సౌకర్యాలతో కూడిన అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ అపార్టుమెంట్లలో చదరపు అడుగు రూ. 4 వేల నుంచి 6 వేల వరకూ ధర నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నాయి. మరి కొన్ని సంస్థలు చదరపు అడుగు రూ.మూడు వేల నుంచి ఐదు వేలలోపే ధర నిర్ణయించి అమ్మకాలు ప్రారంభించాయి.

ఖాళీగా అపార్టుమెంట్లు
రాజధాని ప్రకటన నాటి నుంచి కొందరు బిల్డర్లు నిర్మాణాలు ప్రారంభించారు. వారి నిర్మాణాలు దాదాపు పూర్తికావడంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశాలు చేశారు. వాటిని అద్దెకు తీసుకునే వారు లేకపోవడంతో దాదాపు వెయ్యికిపైగా అపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లో అపార్టుమెంట్ల అద్దెలు అధికంగానే ఉన్నప్పటికీ, వాటి పరిసర ప్రాంతాల్లో అద్దెలు అనుకున్న స్థాయిలో లేవు. డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ రూ.6 వేల నుంచి రూ.8 వేలలోపు లభిస్తున్నాయి. ఇదే నగరాల్లో అయితే రూ.10 నుంచి రూ.15 వేల వర కూ అద్దెలున్నాయి. వీటికి అనుగుణంగానే నగరాల్లోని సామాన్య ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ.45 నుంచి రూ.60 లక్షల్లోపు ఉంటే, ఖరీదైన ప్రాంతాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ధర పలుకుతోంది.
 
 

మరిన్ని వార్తలు