సీఆర్‌డీఏ కోర్ టీమ్ రెడీ

30 Dec, 2014 02:07 IST|Sakshi
సీఆర్‌డీఏ కోర్ టీమ్ రెడీ
  • 10 మంది అధికారులతో ఏర్పాటు
  • ప్లానింగ్ విభాగం హెడ్‌గా రామకృష్ణారావు
  • ల్యాండ్ పూలింగ్‌కు 27 మంది డిప్యూటీ కలెక్టర్లు
  • జనవరి 19 నుంచి సింగపూర్ కమిటీ శిక్షణ
  • రెండు రోజుల్లో సీఆర్‌డీఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం
  • సాక్షి, విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కార్యకలాపాలు పూర్తి స్థాయి లో ప్రారంభించటానికి రంగం సిద్ధమైంది. వివిధ కీలక విభాగాలకు సంబంధించి అధికారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యం గా ప్లానింగ్ విభాగం, అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ పూలింగ్, ఎకౌంట్స్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాలను 20 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేయటానికి కసరత్తు సాగిస్తోంది.  

    మొదట కోర్ టీమ్‌ను సిద్ధం చేశారు. అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పైన తీసుకుంటారు. రెండు రోజుల్లో సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కోర్ టీమ్ రెడీ అయిందని చెప్పారు. నైపుణ్యం ఉండి సీఆర్‌డీఏలో పనిచేసే వారి నుంచి దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నామని చెప్పారు.  
     
    నిపుణులైన అధికారుల కోసం...

    ఇప్పటికే నిపుణులైన అధికారుల కోసం రాష్ట్రంలోని అన్ని కీలక విభాగాల అధికారులతో స్పెషల్ కమిషనర్ మాట్లాడారు. సీఆర్‌డీఏలో ప్లానింగ్ విభాగం హెడ్‌గా ప్రస్తుతం హెచ్‌ఎండీఏలో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణారావును ఎంపిక చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన సీఆర్‌డీఏ విధుల్లోకి రానున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌ను హెడ్‌గా ఎంపిక చేస్తారు. దీంతోపాటు ఆడ్మినిస్ట్రేషన్, ఇంజినీరింగ్ విభాగాల హెడ్‌లతో కలిపి 10 మంది కోర్ టీమ్‌లో ఉంటారు.ల్యాండ్ పూలింగ్ విభాగంలో 27 మంది డిప్యూటీ కలెక్టర్లు పనిచేయనున్నారు. వీరికి సింగపూర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

    బిల్లును న్యాయ శాఖకు పంపిన గవర్నర్

    సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు(సీఆర్‌డీఏ)ను గవర్నర్ నరసింహన్ న్యాయ శాఖకు పంపించారు. న్యాయ శాఖ అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించిన తరువాత మళ్లీ సీఆర్‌డీఏ బిల్లు సంబంధిత శాఖ కార్యదర్శి, మంత్రికి వెళ్తుంది. అక్కడ నుంచి ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తుంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత గవర్నర్ నరసింహన్ ఆమోదానికి బిల్లును పంపుతారు. ఇదంతా పూర్తి అయిన తరువాతనే గజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు