రూ.29 వేల అవినీతి తేల్చేందుకు రూ1.1 లక్షల ఖర్చు

8 Jun, 2014 01:44 IST|Sakshi
రూ.29 వేల అవినీతి తేల్చేందుకు రూ1.1 లక్షల ఖర్చు

బి.కొత్తకోట, న్యూస్‌లైన్: కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తయారైంది అధికారులు చేసిన విచారణ. ఉపాధి హామీ పనుల్లో రూ.29 వేల అవినీతి జరిగిందని అధికారులు తేల్చారు. దీనిని తేల్చేందుకు అధికారులు చేసిన ఖర్చు చూస్తే దిమ్మతిరుగుతుంది. రూ. 29వేల అవినీతికి రూ.లక్షకుపైగా ఖర్చు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

2013-14 ఆర్థికసంవత్సరంలో బి.కొత్తకోట మండలంలో రూ.2.09కోట్ల ఉపాధి నిధులతో పనులు చేపట్టారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు  సామాజీక తనిఖీ నిర్వహించారు. గత నెల 28 నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు మండలంలో సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేశాయి. ఈ బృందాలు మండలంలోని 11 గ్రామపంచాయతీల్లో రూ.28,902 సొమ్ము అక్రమాలబాట పట్టిందని  గుర్తించాయి.

ఈ అక్రమాలను గుర్తించేందుకు ఇద్దరు రాష్ట్ర రిసోర్స్‌పర్సన్లు, 9 మంది జిల్లా రిసోర్స్‌పర్సన్లు, 33 మంది తనిఖీ బృంద సభ్యులు పనిచేశారు. వీరందరికీ అయిన ఖర్చు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వీరికిచ్చే వేతనం, పనులకు సంబంధించిన రికార్డుల జిరాక్స్ కాపీలు, తనిఖీల అనంతరం బృందాలిచ్చిన నివేదికల జిరాక్స్‌కాపీల కోసం మొత్తంగా రూ.1,10,463లు ఖర్చుచేశారు.

రూ.2.09కోట్ల పనుల్లో రూ.28,902 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ బృందాలు తేల్చితే దానికోసం ఖర్చయింది అంతకు మూడు రెట్లు అధికం. అది కూడా ఉపాధి హామీ పథకం నిధుల నుంచే ఖర్చు చేయడం విశేషం.
 

మరిన్ని వార్తలు