కౌన్సెలింగ్ ఇక్కట్లు

23 Sep, 2014 00:03 IST|Sakshi
కౌన్సెలింగ్ ఇక్కట్లు

నూనెపల్లె: నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు సరైన ఏర్పాట్లు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొదటి రోజు 1 నుంచి 10వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 95 మంది హాజరయ్యారు. రెండో రోజు సోమవారం 10,001 నుంచి చివరి ర్యాంకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపట్టగా.. చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంచినీటి వసతి కూడా కల్పించకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు నానా అవస్థలు పడ్డారు. రెండో రోజు మ్యాథ్స్ విభాగానికి సంబంధించి 235 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. వీరి సర్టిఫికెట్లను పరిశీలించి వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు స్క్రాచ్ కార్డులను అందజేశారు. మూడో రోజు మంగళవారం ఫిజిక్స్/ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మొదటి నుంచి చివరి ర్యాంకుల అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని క్యాంప్ అధికారి ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. 23, 24 తేదీల్లో మ్యాథ్స్ విభాగానికి సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. క్యాంపులో సిస్టమ్ అధికారిగా మంజునాథ్, చీఫ్ వెరిఫికేషన్ అధికారిగా వీరభద్రారెడ్డి, వెరిఫికేషన్ అధికారులుగా సురేష్‌బాబు, రామసుబ్బారెడ్డి, లలితకుమారి, వెంకట్రావు వ్యవహరించారు.



 

>
మరిన్ని వార్తలు