పేగు బంధాన్ని అమ్ముకున్నారు

11 Dec, 2013 03:08 IST|Sakshi
పేగు బంధాన్ని అమ్ముకున్నారు

కందుకూరు, న్యూస్‌లైన్: పేదరికం ఆ దంపతుల కన్నపేగును దూరం చేసుకునేలా చేసింది. హాస్పిటల్ బిల్లులు చెల్లించలేని  స్థితిలో తమకు కలిగిన కవలలను అమ్మకానికి పెట్టారు. ఆడపిల్లలన్న కారణమో..లేక సాకలేమన్న భయమో పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని అమ్మేశారు. నెల రోజుల క్రితం లింగసముద్రం మండలం పెదపవని  గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శిశు సంక్షేమ శాఖాధికారులు ఆ పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. పెదపవని గ్రామానికి చెందిన వ్యక్తికి, నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సంకువారిపాలెం గ్రామానికి చెందిన యువతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.

ఇప్పటికే వారికి ఒక బాబు, పాప ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం గతనెల 18న కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చేరారు. మూడో కాన్పులో  ఆడ పిల్లలైన ఇద్దరు కవలలు జన్మించారు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ యజమాని వారిని పోషించలేమని భావించి విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ప్రసవమైన 8 రోజులకు వేటపాలేనికి చెందిన ఓ వ్యక్తికి ఒక పాపను ఇచ్చేయగా.. 9వ రోజు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తికి రెండో పాపను ఇచ్చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కు అయిన ఖర్చు రూ 25 వేలను వారు చెల్లించినట్లు సమాచారం. ఆ దంపతుల కుటుంబ ఖర్చుల కోసం మరికొంత నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఆలస్యంగా శిశు సంక్షేమ శాఖాధికారులకు తెలియడంతో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసులు  పెదపవని వెళ్లి దంపతులను విచారించడంతో పిల్లల్ని ఎవరికి ఇచ్చిందీ చెప్పారు.  అధికారులు పిల్లల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కవల పిల్లల్ని ఒంగోలులోని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి సంరక్షిస్తున్నారు. మంగళవారం పిల్లలిద్దరికీ ఒంగోలులోని హాస్పటల్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం శిశువులిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

  ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన శిశు సంక్షేమశాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కవలలను తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు పిల్లలు లేని వారేనని, తమ సమ్మతితోనే వారు తీసుకెళ్లినట్లుగా చెప్పినట్లు సమాచారం. అయినా చట్టప్రకారం ఇది నేరం కావడంతో కేసులు నమోదు చేశారు. శిశువుల విక్రయంలో పలువురు దళారుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు