ధైర్యం కోల్పోకండి

3 Feb, 2016 09:14 IST|Sakshi
ధైర్యం కోల్పోకండి

రమణమూర్తి కుటుంబానికి జగన్ పరామర్శ
న్యాయం జరిగేలా చూస్తానని భరోసా
శ్రీకాకుళం నుంచి కాకినాడ వచ్చిన జననేత
నేటి ఉదయం హైదరాబాద్ పయనం

కాకినాడ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మబలిదానం చేసిన చీకట్ల వెంకటరమణమూర్తి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ర్ట ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి     బొత్స సత్యనారాయణ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని మంగళవారం రాత్రి పరామర్శించారు.

జగన్‌ను చూడగానే రమణమూర్తి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి బోరున విలపించారు. జగన్ వీరి కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండాలని చెప్పి ఓదార్చారు. కుమారుడు రాజేష్‌తో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమణమూర్తి భార్య పార్వతితో జగన్ మాట్లాడారు. కాపుల కోసమే తన భర్త ప్రాణాలను పణంగా పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరంటూ ఆవేదన చెందారు. రమణమూర్తి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని సూచించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


 శ్రీకాకుళం నుంచి రాక చీకట్ల వెంకటరమణమూర్తి ఆత్మబలిదానంతో చలించిపోయిన జగన్ కాకినాడకు వచ్చి కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై యువతలో చైతన్యం తేవడానికి శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన యువభేరిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో కాకినాడ వచ్చారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాకినాడకు చేరుకున్న జగన్ నేరుగా రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి వచ్చారు. అక్కడ నివాసం ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. కాపు ఐక్యగర్జన సభ నేపథ్యంలో విధ్వంసం చోటుచేసుకోవడం, రిజర్వేషన్ల కల్పన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం వంటి పరిణామాలతో కలత చెంది వెంకటరమణమూర్తి బలిదానం చేసుకున్న ఘటన వివరాలను ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తూ జగన్‌కు తెలియజేశారు.

తర్వాత పార్టీ నాయకులతో కలిసి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లనున్నారు.జగన్ వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పినిపే విశ్వరూప్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ముత్తా గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి,  గిరిజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, తోట నాయుడు,  అనంత ఉదయభాస్కర్, ముత్తా శశిధర్, ధర్మాన కృష్ణదాసు, ఆర్‌వీజేఆర్ కుమార్, అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, చెల్లుబోయిన వేణు, యనమదల మురళీకృష్ణ దంపతులు, పలువురు నాయకులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు