ఎరువులకోసం తోపులాట

3 Nov, 2014 02:22 IST|Sakshi
  • లక్కవరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత
  •  అమ్మకం నిలిపివేత
  • యలమంచిలి: పుడమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో నిండా మునుగుతున్న అన్నదాతలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. హుదూద్ తుపాను ధాటికి సగానికిపైగా పంటలు కోల్పోయిన రైతులు మిగిలిన కొద్దిపాటి పంటలను బాగు చేసుకునేందుకు ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

    రైతులకు అవసరమైన సంఖ్యలో ఎరువులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఎరువుల కోసం సహకార సంఘాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అసలే ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోయిన రైతులకు ప్రభుత్వ వైఖరి మరింత దిగులు కలిగిస్తోంది. ఆదివారం యలమంచిలి మండలం లక్కవరం పీఏసీఎస్ వద్ద ఎరువుల విక్రయం తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎరువులు విక్రయిస్తున్నారని తెలియడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. కేవలం 30 బస్తాలు మాత్రమే స్టాకు ఉండటం, 200 మందికిపైగా రైతులు ఎరువుల కోసం అక్కడకు చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

    ఎరువుల కోసం రైతులు ఒకరినొకరు తోసుకోవడం, వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన రైతులను వారించడం పీఏసీఎస్ సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో యలమంచిలి రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

    అయినప్పటికీ పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో ఎరువుల విక్రయాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. రైతులను పోలీసులు బయటకు నెట్టివేసి గోడౌన్ షట్టర్ దించి తాళం వేయించారు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కొందరు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎరువులు కూడా అందించకపోతే తామెలా వ్యవసాయం చేసుకుంటామని ప్రశ్నించారు.
     

మరిన్ని వార్తలు