చచ్చినా చావే..

7 Aug, 2015 02:22 IST|Sakshi

♦ శ్మశానం విషయంలో ఇరువర్గాల వివాదం
♦ ఐదు గంటలపాటు రోడ్డుపైనే మృతదేహం
♦ తహశీల్దార్, ఎస్సైల చర్చలతో ముగిసిన అంత్యక్రియలు
 
 కలిగిరి : మండలంలోని అనంతపురం ఎస్సీ కాలనీలో శ్మశానానికి సంబంధించి ఇరువర్గాలు వారు గురువారం వివాదానికి దిగారు. దీంతో యువకుని మృతదేహం ఐదు గంటలపాటు నడి రోడ్డుపైనే ఉంచారు. ఎస్సీకాలనీకి చెందిన  15 కుటుంబాలు పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ వద్ద రెండేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. అక్కడ నివసిస్తున్న పాతల చిరంజీవి (22) అనారోగ్యంతో గురువారం వేకువజామున మృతి చెందాడు. మృతదేహాన్ని ఖననం చేయడానికి బంధువులు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరారు. పాతకాలనీవాసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో మృతదేహన్ని రోడ్డుపై ఉంచి పోలీసులకు సమాచారమిచ్చారు.

ఎస్సై ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దార్ రవీంద్రనాథ్ వచ్చి ఇరువర్గాలతో చర్చించారు. తరతరాలుగా ఈ  శ్మశానాన్నే వినియోగిస్తున్నామని మృతుని బంధువులు తెలిపారు. మృతుని కుటుంబీకులు కొత్త కాలనీలో పట్టాలు పొందారని, వారికి అక్కడే శ్మశానం కేటాయించాలని పాతకాలనీవాసులు పట్టుపట్టారు. దీంతో సమస్యను తహశీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు గ్రామంలో ఊరేగింపులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించే ఇరువర్గాలను ఒప్పించారు. ఎస్సై పర్యవేక్షణలో రాత్రి 8 గంటకు అంత్యక్రియలు ముగిశాయి.

మరిన్ని వార్తలు