మాటలేనా..మాఫీలేదా?

27 Jul, 2014 00:47 IST|Sakshi
మాటలేనా..మాఫీలేదా?
  •   ‘నరకాసుర వధ’ విజయవంతం
  •   టీడీపీ అరాచకాలను లెక్కచేయని రైతులు, మహిళలు
  •   రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్
  • సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణాలన్నీ రద్దుచేస్తానని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు దాటినా రుణమాఫీపై పూటకోమాట చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

    ఎటువంటి షరతులు లేకుండా రుణాలన్నీ రద్దుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో మూడు రోజులు చేపట్టిన ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి రైతులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పల్లెలు, పట్టణాలు.. అనే తేడా లేకుండా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాటలతో గారడీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

    ఎటువంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని నినదించారు. వెంటనే ఖరీఫ్ సాగుకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము కోరుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం ఏమిటని పలుచోట్ల మహిళలు నిలదీశారు. మూడు రోజులుపాటు జరిగిన ‘నరకాసుర వధ’ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు.
     
    టీడీపీ నేతల హల్‌చల్!

    రైతులు, మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘నరకాసుర వధ’ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అధికార బలాన్ని ఉపయోగించి పోలీసుల సాయంతో అడుగడుగునా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అనవసరంగా రోడ్డెక్కి అల్లరు సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించారు.

    గురువారం పామర్రులో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి శాంతియుత వాతావరణంలో చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమాన్ని అడ్డుకుని అరాచకం సృష్టించారు. శుక్రవారం కూచిపూడిలోనూ వైఎస్సార్ సీపీకి ప్రతిగా టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో 144 సెక్షన్ విధించారు. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
     
    మూడో రోజూ నిరసనల వెల్లువ

    శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యాన చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు రైతులు, మహిళలను నిలువునా మోసం చేశాడని ఉదయభాను విమర్శించారు.
     
    పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు.
     
    నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో పాటు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
     
    నందిగామలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు.
     
    వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాలని చల్లపల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
     
    ‘నరకాసుర వధ’లో పాల్గొన్న రైతులు వ్యక్తంచేసిన అనుమానాలు

    రైతుల రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఏమాత్రం స్పష్టత లేదు. తీవ్రమైన అయోమయం, గందరగోళంగా ఉంది.
     
     రుణమాఫీపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. విడ్డూరమైన ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఎర్రచందన చెట్లను తాకట్టు పెడతారట, ఇసుకపై సెస్ వేస్తారట, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను తెచ్చి మభ్యపెట్టేలా ఉన్నారు.
     
     బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. అసలు రుణమాఫీ  ఎక్కడుంది?  ఎక్కడ అమలవుతోంది?
     
     జూన్ 30వ తేదీలోపు రుణాలు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేదే. చంద్రబాబు మాటలు నమ్మి పాత రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.3వేలు కడితే సరిపోయేదానికి ఇప్పుడు రూ.13,000 చెల్లించాల్సి వస్తోంది.  అదనపు వడ్డీ ఎవరు చెల్లించాలి. మేమా.. లేక  ప్రభుత్వం భరిస్తుందా?
     
     రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం.
     
     రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు ఎవరు భరోసా ఇస్తారు.
     
     ఆదేశాలు రాలేదంటున్నారు..
     రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన తర్వాత బ్యాంకుల వద్దకు వెళ్తే ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు. రైతులకు ఓదార్పు మాటలు చెబుతున్నారు గానీ, రుణమాఫీ అమలయ్యే సూచనలు కనిపించటం లేదు. రైతుల బాధలు ఎప్పటికి కడతేరేనో.          
    - ప్రత్తి వీరబాబు, మునిపెడ,కృత్తివెన్ను మండలం
     
     మభ్య పెడుతున్నారు
     నిధులు అందుబాటులో లేకుండా ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. బ్యాంకులు రుణాలు వసూళ్లకు ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు వడ్డీలు ప్రభుత్వమే భరించాలి. ఇన్సూరెన్స్ అమలవుతుందో, లేదో తెలియని పరిస్థితి రైతుల్లో నెలకొంది.         
     - వెంట్రపాటి శ్యాంబాబు,  పెందుర్రు, బంటుమిల్లి మండలం
     
     స్పష్టమైన ప్రకటన  చేయాలి
     చంద్రబాబు మాట నమ్మి పాత రుణాలను చెల్లించలేదు. రుణాలు రీషెడ్యూలు చేస్తే 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ వడ్డీ ఎవరు కట్టాలనే విషయంపై స్పష్టతలేదు. ఒకవైపు ఖరీప్ సీజన్ రెండు నెలలు గడిచింది. ఎప్పటికి పంట రుణం ఇస్తారో అర్థంకావడం లేదు.
     - నాగమల్లేశ్వరరావు, కోకనారాయణపాలెం, గూడూరు(మం)
     

మరిన్ని వార్తలు