అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం

2 Jun, 2014 00:45 IST|Sakshi

 తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరిట భవిష్యత్తులో ప్రకృతి వినాశనం తప్పదని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జి.విజయకుమార్ హెచ్చరించారు. ఆదివారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జన విజ్ఞాన వేదిక జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేరిట పరిశ్రమల స్థాపన కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తారని, ఇది పర్యావరణ విఘాతానికి దారి తీస్తుందన్నారు.   
 
 ఇప్పటికే గత ప్రభుత్వాలు అవినీతి ముసుగులో ఖనిజ సంపదను వెలికి తీసి అపారమైన జంతుజాలం నాశనానికి కారణమయ్యాయన్నారు. జన జీవనానికి భంగం క లగకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అటు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నూతనంగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం గానీ ఇప్పటికీ నూతన రాష్ట్రానికి దిశానిర్దేశం చేయకపోవడం శోచనీయమన్నారు.

అనంతరం రాష్ట్ర విభజనతో జన విజ్ఞాన వేదిక పేరు మార్పు చేయాలా? వద్దా? అని జిల్లా సమితి నిర్ణయాన్ని తెలుసుకుని రాష్ట్ర కమిటీకి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గురువయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.రామచంద్రయ్య, పీఎల్.నరసింహులు, డీ.వెంకటేశ్వర్లు, అచార్య డీవీ.రమణ, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.బలరాం, సీఎన్.క్షేత్రపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు