ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

8 May, 2016 02:32 IST|Sakshi
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని చంద్రబాబు
వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శులు పెద్దిరెడ్డి, భూమన ధ్వజం

 
 
తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతిలోని  పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో శనివారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ నాడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహి చంద్రబాబు అన్నారు. సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన హామీలు మరిచారా? అని ప్రశ్నించారు.

రెండేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడంతో రైతులు ప్రజలు సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొంత భాగం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఉంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాలు లాగా రాష్ట్ర ప్రత్యేక  హోదా సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం జగనన్న చేపట్టే ప్రతి ఉద్యమంలో భాగస్వాములవుదామన్నారు.

పార్టీ రాష్ట్ర నాయకులు పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ప్రాజెక్టులు పూర్తికావని, పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగావకాశాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు.  మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై చంద్రబాబు తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. తిరుపతి విమానాశ్రయంలో పెట్టిన కేసులు నిలవలేదని, రాజంపేటలో మళ్లీ అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు నీతిమాలిన రాకీయాలకు నిదర్శనమన్నారు.
 
 
 10వతేదీ ధర్నాను విజయవంతం చేయండి

 ప్రత్యేక హోదా సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 10వతేదీన చిత్తూరు కలెక్టరేట్ వద్ద, తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ల వద్ద చేపట్టే ధర్నాతో చంద్రబాబు గుండెల్లో దడ పుట్టాలన్నారు. జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, అనుబంధ సంస్థలు, అభిమానులతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నాయకులు బీరేంద్రవర్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, తిరుపతి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దుద్దేల బాబు, టి. రాజేంద్ర, పుల్లయ్య, సయ్యద్‌షఫీఖాదరీ,  హరిప్రసాద్‌రెడ్డి, ఎస్‌కె. ఇమామ్,  హనుమంత్‌నాయక్, కట్టా గోపీయాదవ్, ముద్రనారాయణ, చెలికం కుసుమ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు