కష్టాల ప్రయాణం

10 Feb, 2014 03:33 IST|Sakshi

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:  రోడ్డు రవాణా సంస్థలో మహిళా కండక్టర్లు అసౌకర్యాల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రయాణించడం..  కిటకిటలాడే బస్సుల్లో టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులను సరి చూసుకోవడం, స్టేజీ వచ్చేలోపు స్టాటస్టికల్ రిపోర్టు (ఎస్‌ఆర్) రాయడం లాంటివి పురుషులతో సమానంగా చేస్తున్నా ఉద్యోగినిల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సంస్థ మహిళలకు 33శాతం రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయడంతో కండక్టర్ పోస్టుల్లో చేరిన మహిళలకు సమస్యలు నిరంతరం వెన్నాడుతూనే ఉన్నాయి. అధికారుల అలసత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వెరసి విధులంటేనే విసుగెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 970 బస్సులున్నాయి. వీటిలో విధులు నిర్వహించేందుకు 1970 మంది కండక్టర్లు ఉండగా అందులో 272 మంది మహిళా కండక్టర్లున్నారు. ప్రతి డిపోలో 20 నుంచి 30 మంది వరకు ఉన్నారు.
 
 అంతటా అసౌకర్యాలే: మహిళా కండక్టర్లకు ప్రత్యేక సౌకర్యాలు, సెలవులు, వసతులు కల్పించాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలని నోరు తెరిచి అడిగితే పైఅధికారుల ఆగ్రహానికి గురికావాల్సిందే.
 
  డిపోలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. నిర్వాహణ సరిగా లేకపోవడంతో వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా కండక్టర్లు ఇష్టపడడం లేదు.
 
  డ్యూటీ టర్మినల్ పాయింట్లలో తాగునీరు, మూత్రశాలల వసుతులు కల్పించాల్సి ఉంది. ఈసౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మౌనం వహిస్తున్నారు.
 
  ప్రత్యేక సెలవులుగా నెలకు 3 రోజులు అదనంగా క్యాజువల్ లీవ్‌లు ఇవ్వాల్సి ఉంది. కాని సెలవులు ఇవ్వాలంటే ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కండక్టర్లు వాపోతున్నారు.
 
  నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల లోపే పూర్తయ్యే డ్యూటీలు వేయాలి. కాని రాత్రి 11గంటల ఉండే విధులప్పగిస్తున్నారు.
 
 అందరికీ చార్ట్ (రెగ్యూలర్‌గా తిరిగే సర్వీసులు) డ్యూటీలు వేయడం లేదు. ఫలితంగా కొందరు ఈ రోజుకు ఏ సర్వీసు వేశారో అని చూసుకుంటే మరి కొందరు మాత్రం డ్యూటీలు లేక ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి.
 
  అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు ఉండనే ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం సాధారణమైంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో డ్యూటీలు వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
 
  మెరున్ రెడ్ శారీ (చీరలు) డ్రస్ కోడ్‌గా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించినా  అమలుకు నోచుకోలేదు. బూట్లు కూడా  ముఖ్యంగా చిల్లర సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నిబంధనల ప్రకారం విధులకు హాజరయ్యే ముందు కండక్టర్లకు రూ.50ల చిల్లర ఇవ్వాల్సి ఉంది. కాని సరిగా ఇవ్వకపోవడం, ప్రయాణికులు వంద, ఐదు వందల రూపాయల నోట్లు ఇవ్వడం సమస్యకు దారి తీస్తోంది.   
 

మరిన్ని వార్తలు