ఇదేంది తమ్మీ?

5 Jan, 2014 05:15 IST|Sakshi

 వరంగల్, న్యూస్‌లైన్ :  దేవాదుల.. 24 కిలోమీటర్ల ఉప కాల్వ పనులను రూ.42 కోట్లతో పూర్తి చేసేందుకు పాత పనులు చేస్తున్న కాంట్రాక్టరే ఒప్పుకున్నాడు. భారీ నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు కూడా ఓకే చేశారు. మంత్రి నేతృత్వంలోని కమిటీ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కానీ... తమ్ముళ్ల రంగప్రవేశంతో నాలుగు రోజుల్లోనే సీన్ అంతా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే అంచనా వ్యయం అదనంగా రూ.19 కోట్లు పెరిగింది. రూ.42 కోట్ల విలువైన పని అమాంతంగా రూ. 61 కోట్లకు ఎగబాకింది. ఈ లోగుట్టును భారీ నీటి పారుదల శాఖ ఆడిట్ విభాగం పసిగట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ ఆర్‌ఎస్ కాల్వ కింద ఉప్పగూడెం శివారు నుంచి 4వ కాల్వ నిర్మాణానికి 2010లో రూపకల్పన చేశారు. పాలకుర్తి వరకు మొత్తం 24 కిలోమీటర్ల ఉప కాల్వను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు.

అయితే అప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయరు నుంచి ప్రధాన కాల్వ నిర్మాణం చేపట్టారు. ఈ 4వ కాల్వ నిర్మాణం పనులను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. ముందుగా దీనికింద 12 వేల ఎకరాల ఆయకట్టుగా గుర్తించారు. కానీ... మరికొంత దూరం పెంచి 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిందించే 4వ కాల్వ నిర్మాణానికి పూనుకున్నారు.  దీన్ని ప్రధాన కాల్వ నిర్మాణ పనులు చేస్తున్న సత్యసాయి ఇన్‌ఫ్రా, కె.వెంకటేశ్వర్లు కంపెనీలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ కింద రూ. 42 కోట్లతో కాల్వ నిర్మాణానికి నీటి పారుదల శాఖ పచ్చజెండా ఊపింది. అప్పటికే ఉప కాల్వల టెండర్లు ఖరారు చేయడంతో... దీన్ని నామినేషన్‌గా ఇచ్చేందుకు అంగీకరించింది. 2010 ఆగస్టులో అగ్రిమెంట్‌కు రంగం సిద్ధం కాగా...  ఓ పార్టీ అధ్యక్షుడికి సన్నిహితంగా ఉండే ఓ నేత కోసం జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చక్రం తిప్పారు.

ఈ పనుల ఒప్పందానికి అడ్డుపడడంతో నామినేషన్‌పై ఇచ్చే పని ఆగిపోయింది. ఆ తర్వాత సదరు నాయకుడు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ నేతతో రాయబారం నడిపాడు. ముందుగా ప్రతిపాదించిన ప్రకారమే పొడవు, వెడల్పు... 24 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ... నిర్మాణ వ్యయం మాత్రం రూ.42 కోట్ల నుంచి రూ. 61 కోట్లకు చేరింది. ఈ మేరకు యూఏఎన్ మాక్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌పీపీఎల్ సంస్థలకు నామినేషన్‌పై పనులు అప్పజెప్పారు. ఆ సంస్థలు 2011లో ఆ పనిని అగ్రిమెంట్ చేసుకున్నారుు. 24 నెలల కాల పరిమితిలోనే ఈ పని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ... 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించారు.

 మళ్లీ రూ. 10కోట్లు అట..
 ప్రస్తుతం పనుల గడువు పెంచుతున్న నేపథ్యంలో నిర్మాణం అంచనా వ్యయంమరింత పెంచాలని సదరు కాంట్రాక్టర్లు పైరవీ చేస్తున్నట్లు సమాచారం. రూ. 10 కోట్ల మేర పెంచేలా ఇంజినీర్లతో కలిసి ప్రతిపాదనలు చేస్తుండడం గమనార్హం.
 ఆడిట్ ఆబ్జెక్షన్
 నీటి పారుదల శాఖ ఆడిట్ విభాగం అంచనాల పెంపును పసిగట్టింది. రూ. 42 కోట్ల అంచనాను రూ. 61 కోట్లకు పెంచడంపై వారం రోజుల క్రితం భారీ నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు సంజాయిషీ నోటీసులిచ్చింది. ఎలాంటి పెంపు లేని కాల్వకు రూ. 19 కోట్లను అదనంగా కట్టబెట్టడం దుర్వినియోగమేనని ఆడిట్ నివేదికల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు