పోటీకి దారేది?

23 Oct, 2013 03:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రానున్న సాధారణ ఎన్నికలకు నాయకులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. పోటీ చేసేందుకు అవకాశమున్న పార్టీలతో పాటు అనుకూలమైన స్థానాల కోసం అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష తెలుగుదేశంలో ప్రస్తుత శాసనసభ్యులతో పాటు ఆశావహులది కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్‌పార్టీలోనైతే విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం వణకిపోతున్నారు. ప్రత్యామ్నాయం కోసం అనుచరులు, శ్రేయోభిలాషుల సలహాలు కోరుతూ సంప్రదింపుల్లో మునిగితేలుతున్నారు.
 
 పార్టీతో పాటు తమపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుంచి తప్పించుకునేందుకు కొందరు నాయకులు సురక్షిత స్థానాల కోసం వెతుకుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలు, పార్టీల ప్రభావం, ఇతరత్రా అంశాలపై  క్షుణ్ణం గా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఏ నాయకుడు ఎటు వెళ్తారో తెలియని గందరగోళం కూడా చివరిలో నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలపై గురిపెట్టిన నాయకులకు మారుతున్న రాజకీయాలతో కొంత అభద్రత చోటుచేసుకుంది. జిల్లాలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులను ఒకటిరెండు నెలల్లోనే చూడవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. తాము అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగితే వారు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకోవడం కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు జిల్లాలో వరుసగా జరిగిన రెండు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ హవా నడవడం కూడా వారిని ఆందోళనకు గురి చేస్తోంది. కావలి కాంగ్రెస్‌లో ఐదారు నెలలుగా ముసలం ఏర్పడింది. ఇక్కడ ఒక ముఖ్యనేత కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
 
 నియోజకవర్గంలో మంత్రి ఆనం జోక్యాన్ని తగ్గించాలని ఎన్నిసార్లు విజ్ఙప్తి చేసినా పట్టించుకోకపోవడం ఆయన ఆగ్రహానికి కారణం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి కిందటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్  తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఈసారి జెండా మార్చేస్తారనే ప్రచారం విస్తృతంగా ఉంది. ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రస్తుతం మంత్రి ఆనం అనుచరులుగా నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకున్న కంభం ఎన్నికలు సమీపించే తరుణంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు  నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ  చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
 
 అదే జరిగితే కావలి నుంచి టీడీపీ తరపున కొత్త వారికి అవకాశం రావచ్చు. కోవూరులో కాంగ్రెస్, టీడీపీలు రెండింటికీ అభ్యర్థుల కొరత ఉంది. కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పార్టీ మార్చే అవకాశాలున్నాయి. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈసారి కోవూరు నుంచి పోటీ చేయకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆయన రాజ్యసభపై కన్నేసినట్టు చెబుతున్నారు. గత్యంతరం లేనిపరిస్థితుల్లోనే 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. 2009లో గూ డూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక కృష్ణయ్య ఈసారి వేరే జిల్లా నుంచి లోక్‌సభకు పోటీ  చేసే యోచనలో ఉన్నారని తెలిసింది.
 
 పార్టీ ఆదేశిస్తే గూడూరు నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని సమాచారం. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పంచాయతీ ఎన్నికల తరువాత జిల్లాకు పెద్దగా రాకుండా వ్యాపారాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో చక్రం తిప్పుతున్న ఆనం సోదరులు మాత్రం ఆ పార్టీలోనే కొనసాగక తప్పని పరిస్థితి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగాను ఆనం బ్రదర్స్‌పై వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.  
 

మరిన్ని వార్తలు