విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ షురూ

13 Feb, 2015 01:15 IST|Sakshi
విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ షురూ

500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు
ఎయిర్‌పోర్టు డెరైక్టర్ భూమిపూజ

 
విమానాశ్రయం (గన్నవరం) : గన్నవరం విమానాశ్రయంలో టెర్మినల్ భవన విస్తరణ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు, సుమారు 500 మంది కూర్చునేందుకు  వీలుగా ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవన విస్తరణ పనులు చేపట్టారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఈ టెర్మినల్‌లో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 125 మంది ప్రయాణికులు కూర్చునేందుకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా టెర్మినల్ విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ విస్తరణ పనులను ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిశోర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకునే విధంగా టెర్మినల్ భవనాన్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్‌బీసీసీ బృందం పరిశీలన

టెర్మినల్ ఆధునికీకరణ పనులను నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు చెందిన ఎస్‌కే చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పరిశీలించింది. టెర్మినల్ భవనం విస్తరణకు సంబంధించి విమానాశ్రయ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ పలువురు విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టు విస్తరణకు కసరత్తు

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ అంశంపై కలెక్టర్ కసరత్తు చేపట్టారు. విమానాశ్రయంలో అదనపు వసతుల కల్పనకు అవసరమైన పనులు     చేపట్టేందుకు ఢిల్లీకి చెందిన జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ (నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె.చౌదరి, జనరల్ మేనేజర్ ఆర్‌ఎస్కే జైన్‌లతో కూడిన బృందంతో గురువారం రాత్రి కలెక్టర్ తన చాంబర్‌లో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలకు అదనంగా డిపార్చర్ టెర్మినల్‌ను విస్తరించడం, అదనంగా మరో కన్వేయర్ బెల్టు నిర్మాణం, సెక్యూరిటీ కవరేజ్ పెంచడం వంటి అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం ఆయా పనుల కోసం స్థల పరిశీలన చేశారు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన కోసం స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఈ బృందం విమానాశ్రయం నుంచి విజయవాడ మార్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సంస్థ గన్నవరం విమానాశ్రయంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ నగరం వరకు పది కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పనులు రాజధాని అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చేపట్టనున్నదని కలెక్టర్ వివరించారు.

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు ఆర్టీసీ అంగీకారం

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ నడిపేందుకు ఆర్టీసీ అంగీకరించిందని కలెక్టర్ బాబు తెలిపారు. గన్నవరం నుంచి విజయవాడ వచ్చే బస్సులు విమానాశ్రయంలోకి రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విమానాశ్రయం నుంచి బయటి వరకు లగేజీ, పిల్లలతో నడిచి వస్తున్న ప్రయాణికుల ఇబ్బందులను తాము స్వయంగా గమనించే బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేడు భూసేకరణపై రైతులతో సమావేశం

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూసేకరణపై పరిసర గ్రామాల రైతులతో కలెక్టర్ శుక్రవారం ఉదయం సమావేశం అవుతారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు