మృత్యువే గెలిచింది

27 Jan, 2015 01:32 IST|Sakshi
మృత్యువే గెలిచింది

చిట్టినగర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన శివకేశ్వరి మృతి
7 రోజులుగా మృత్యువుతో పోరాడినా దక్కని ఫలితం
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
 

చిట్టినగర్ : పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ తల్లి గాయాల బాధను తట్టుకుంటూ బిడ్డల భవిష్యత్తును చూసుకోవాలనే కోరికతో మృత్యువుతో ఏడురోజుల పాటు పోరాటం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మృత్యువే గెలిచింది. తల్లి మరణంతో ఆమె పిల్లలిద్దరు పడుతున్న వేదన వర్ణనాతీతం. విజయవాడ కేఎల్‌రావు నగర్‌లో గత మంగళవారం ఉదయం భారీ విస్ఫోటనంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తపల్లి శివకేశ్వరి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది.
 కేఎల్‌రావునగర్ రాజీవ్‌శర్మనగర్‌లోని మరుపిళ్ల బాలరాజుకు చెందిన రెండంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో గత మంగళవారం భారీ విస్ఫోటనం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు గాయాలతో నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో కొత్తపల్లి శివకేశ్వరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన శివకేశ్వరి ఇంట్లోనే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినా ప్రమాదం కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

అయితే శివకేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అమె నుంచి ఫిర్యాదు మాత్రమే  స్వీకరించారు. అమె కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలను తెలుసుకోవాలని భావించారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది శివకేశ్వరితో విచారణ జరిపితే బయట పడుతుందని అటు పోలీసులు, ఇటు కేఎల్‌రావునగర్ వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఆమె మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొత్తపేట పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా, వారు స్వగ్రామానికి తరలించారు. శివకేశ్వరి చనిపోవడంతో కేసు పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. ఆమె మరణంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
 
 

మరిన్ని వార్తలు