సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

21 Dec, 2014 02:52 IST|Sakshi

కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు.  వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీ ఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని సక్సెస్ పాఠశాలల ద్వారా అందించిన ఘనత ఆయనదేనన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చరిత్రలో లేని విధంగా 35,600 మందికి ప్రమోషన్లు కల్పించారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మరిన్ని ఆందోళనలు తప్పవన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనాథరెడ్డి, జిల్లా కోశాధికారి దివాకర్‌బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సింగారెడ్డి అమర్‌నాథ్‌రెడ్డి ప్రసంగించారు.
 
 పలు సమస్యలపై డిమాండ్:
 60 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు 2013 జూలై నుంచి పీఆర్సీని ప్రకటించాలి. ఆరోగ్య కార్డులను వెంటనే వినియోగంలోకి తెచ్చి అన్ని రకాల వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిబంధనలు లేని వైద్యం అందేలా చూడాలి. క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటును  వెంటనే ఆపాలి. భాషోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎయిడెడ్, మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్‌ని వెంటనే అమలు చేయాలి. ఎయిడెడ్, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఆరోగ్యకార్డులను వెంటనే అందించాలి తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌ఓ సులోచనకు అందజేశారు.

మరిన్ని వార్తలు