అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

26 Jan, 2016 19:54 IST|Sakshi

అప్పుల బాధ తాళలేక ఓ పొగాకు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పందిరిపల్లి వెంకట సత్యనారాయణ (45) అనే రైతు తనకున్న 70 సెంట్ల పొలంతోపాటు ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని  పొగాకు సాగు చేస్తున్నాడు.

సగత సీజన్‌లో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. దీంతో బ్యాంకులతోపాటు స్నేహితులు, బంధువుల నుంచి సుమారు రూ.16 లక్షల వరకు అప్పు చేసినట్టు అతని కుటుంబసభ్యులు తెలిపారు. రుణమాఫీ కాకపోవడం, ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు రావడం, అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి కోర్టు నోటీసులు అందడంతో సత్యనారాయణ మనోవేదనకు గురయ్యాడు.

దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకుల నుంచి కొత్త రుణాలు ఇవ్వకపోడంతో పాత అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక సత్యనారాయణ మంగళవారం ఇంట్లోనే పురుగుమందు తాగాడు. అప్పుల భారాన్ని మోయలేక, అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

మరిన్ని వార్తలు