రైతు సమస్యలపై హెల్ప్‌లైన్

5 Sep, 2014 01:19 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ‘డ్రౌట్ సెల్ హెల్ప్‌లైన్’ను ఏర్పాటు చేశారు. రైతుల ఆత్మహత్యలపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ స్పందించారు. హెల్ప్‌లైన్ నిర్వహణకు రెవెన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించారు. అప్పుల బాధలు, ఇతర సమస్యలు ఏవైనా ఉంటే 18004256401 లేదా 08554-246401 నంబర్లకు ఫోన్ చేసి తెలియ జేయాలని కలెక్టరేట్ అధికారులు సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించి.. రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
 
  రైతు ఆత్మహత్యల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జీవో 421 విడుదలైంది. దీన్ని ఇంతవరకు జిల్లా అధికారులు పట్టించుకోలేదు. అయితే.. రైతు ఆత్మహత్యలపై ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్.. హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చొరవ చూపారు. జిల్లాలో గడిచిన మూడు నెలల్లో 17 మంది రైతులు అప్పుల బాధతో మృతి చెందారు. అయితే.. ఇందులో ఆరుగురు రైతుల కుటుంబాలు మాత్రమే పరిహారానికి అర్హమైనవని అధికారులు ప్రకటించారు.
 
 ఈ విషయంపై గురువారం ‘సాక్షి’లో ‘అన్యాయం’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. మిగిలిన 11 మంది రైతుల ఆత్మహత్యలపై సమగ్రంగా విచారించి నివేదిక పంపాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేపట్టారు. రెండ్రోజుల్లో సమగ్ర నివేదికలను కలెక్టర్‌కు అందజేయనున్నారు.
 

>
మరిన్ని వార్తలు