అన్నదాతకు దన్నుగా..

2 May, 2015 02:58 IST|Sakshi

- రైతు, వ్యవసాయ సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
- 4, 5 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాలవద్ద ఆందోళనలు
- విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపు
జగ్గంపేట :
పదిమంది ఆకలిని తీర్చే తిండిగింజల్ని పండించే అన్నదాతకు దన్నుగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించనుంది. రైతు, వ్యవసాయ సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో.. ఈ నెల 4, 5 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాలవద్ద ఆందోళనలు చేసి, వినతిపత్రాలను అందజేయనున్నట్టు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ శుక్రవారం తెలిపారు. పచ్చని పంటలకు నెలవైన జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా విపరీత పరిస్థితి తలెత్తిందని, తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడి కరువు పరిస్థితులు కలవర పెడుతున్నాయని అన్నారు. ఒక్క ఏడాదిలోనే భయానక తుపాను, కరువు, అకాల వర్షాలు జిల్లావాసుల్ని అతలాకుతలం చేశాయన్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా సగటు వర్షపాతం 1119.5 మిల్లీమీటర్లు కాగా 599.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందన్నారు. మొత్తం 46.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అకాల వర్షాలకు పంటలు నేలపాలయ్యాయయని అన్నారు. రైతు, వ్యవసాయ సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రతి నియోజకవర్గంలో కన్వీనర్లు, మండల కన్వీనర్లు, పార్టీ శ్రేణులు 4, 5 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని జ్యోతుల పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయపరంగా ఎదుర్కొంటున్న తొమ్మిది ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
ఇవీ డిమాండ్లు..
-  మంచినీటి ఎద్దడిని నివారించాలి.
-  రైతు, రైతు కూలీల వలసలను నిరోధించాలి.
- కరువు, హుద్‌హుద్ తుపాను, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి.
- తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలి.
-  పంటలకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలు రానప్పుడు రైతుకు మద్దతుగా నిలబడేందుకు రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలి.
- పంటలకు బీమా అమలు చేయాలి.
- తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలి.
- వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలి.
- జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయాలి.

మరిన్ని వార్తలు