ప్రజా పక్షాన పోరాటం

13 Nov, 2014 04:16 IST|Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్
బొబ్బిలి : ప్రజలను నమ్మించి, మాయ మాటలు చెప్పి అమలు చేయలేని వాగ్దానాలిచ్చి టీడీపీ అధికారంలోనికి వచ్చిందని, అవన్నీ ఇప్పుడు అబద్ధాలని తేలాయని వైఎస్‌ఆర్ సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షతన బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా  సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ హామీలు అమలు చేసే వరకూ ప్రజల తరఫునప్రభుత్వంతో  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని చెప్పారు.ప్రభుత్వంపై వ్యతిరేకిత ఉన్నా   బయటకు రానివ్వకుండా మీడియా సహకారాన్ని అందిస్తోందన్నారు. ప్రభుత్వం చేసిన ప్రతీ తప్పిదాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకొని ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందన్నారు. వీటికి త్వరలో నియమించనున్న కమిటీలే ప్రధాన బాధ్యత తీసుకోవాలన్నారు. నిస్వార్థంగా పనిచేసి కష్టపడేవారికి కమిటీల్లో స్థానం ఉంటుందన్నారు.

జన్మభూమిలో పింఛన్ల పంపిణీలో అర్హులను తప్పించడం వంటి వాటిపై స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంపై పోరాటం చేస్తూనే, అధికార పార్టీని నమ్మి అధికారులు చేస్తున్న తప్పిదాలను కూడా ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉందన్నారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి కమిటీల పేరుతో ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసిందన్నారు.

కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు మినహా మిగిలిన మండలాల్లో ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కొమరాడ మండలంలో పింఛన్లు ఇవ్వడానికి ఏకంగా మంత్రి ఇచ్చిన లేఖలు పట్టుకొని వచ్చి కమిటీలు వేసుకున్నారన్నారు. పింఛన్లు తొలగించడంతో టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనిపై పోరాటం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఇచ్చిన వారిలో అనర్హులు, అర్హత ఉండే వారి జాబితాను పార్టీ కార్యకర్తలు, నాయకులు తయారు చేయాలన్నారు. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు తొలగిస్తే  బాధితుల తరపున  న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అందుకు పూర్తి వివరాలను అందించాలన్నారు.
 జిల్లాలో  పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. నాలుగేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తే ‘‘మిమ్మల్ని మోసం చేశాం.. మేం మోసపోయాం ’’ అంటూ అడుగడుగునా మహిళలు, పేదల రోదనలే వినిపించాయని, దాంతో షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగని పరిస్థితి  వచ్చిందన్నారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వేల మంది పింఛనుదారులను తొలగించారన్నారు . గ్రామస్థాయిలో కమిటీలు అవసరమని, వాటి ద్వారా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అవకాశం ఉందన్నారు.

విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చెప్పినట్లు చేయడం లేదని, ఏ పథకాలకూ బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారికి అండగా ఉండి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నెల 5న మండల కార్యాలయాల వద్ద నిర్వహించిన ధర్నాల సందర్భంగా ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టామన్నారు. జిల్లాలోపార్టీని మరింత బలోపేతం చేయడానికి  ప్రతి ఒక్కరూ  కష్టపడాలన్నారు.  పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం నియోజకవర్గ నాయకుడు పరీక్షిత్‌రాజ్,  సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జర్జాపు ఈశ్వరరావు, పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, గంట్యాడ మండల ఎంపీటీసీ సభ్యుడు జైహింద్‌కుమార్, బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు తదితరులు మాట్లాడారు.    

ఎస్‌కోట నియోజకవర్గ సమన్వయకర్త నెక్కలి నాయుడు బాబు, ప్రచార కమిటీ నాయకడు గొర్లె వెంకటరమణ, వ్యవసాయ విభాగం నాయకులు సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనుమల్ల వెంకటరమణ,  ఏఎంసీ  మాజీ  చైర్మన్  అంబళ్ల శ్రీరాములునాయుడు, విజయనగరం నాయకులు, కౌన్సిలర్లు ఎస్వీ రాజేష్, ఆశపు వేణు, అవనాపు విక్రమ్, సాలూరు నాయకలు జర్జాపు సూరిబాబు, బొబ్బిలి ఎంపీపీ గోర్జి వెంకటమ్మ,  జెడ్పీటీసీ సభ్యురాలు మామిడి గౌరమ్మ,  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బేతనపల్లి శివున్నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ మడక తిరుపతిరావు, నర్సుపల్లి వెంకటేశ్వరరావు, గిరి రఘు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు