ఆఖరి పోరాటం

24 Aug, 2014 03:33 IST|Sakshi
ఆఖరి పోరాటం
  •  బ్రహ్మోత్సవాల వరకు ఉంచండి : ఎంజీ గోపాల్       
  •  ఏపీ కేడర్‌కే కేటాయించండి : సిద్ధార్థ్‌జైన్
  •  చంద్రబాబుకు ఐఏఎస్‌ల వినతి                  
  •   చేతులెత్తేసిన  ముఖ్యమంత్రి     
  • తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారు. ఐఏఎస్‌ల విభజనలో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్ జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో తనను బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్.. తనను ఆంధ్ర కేడర్‌కే కేటాయించేలా చేసి, జిల్లా కలెక్టర్‌గా కొనసాగించాలని సిద్ధార్థ్‌జైన్ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు కేంద్రం ప్రత్యూష్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన ఎంజీ.గోపాల్ 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. స్థానికతను ప్రాతిపదికగా తీసుకున్న ప్రత్యూష్ కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్‌జైన్ 2001 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. సరిగ్గా 43 రోజుల కిత్రం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

    సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఐఏఎస్‌ల విభజనపై ఈనెల 29 వరకు  కమిటీ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. సెప్టెంబరు 2న తుది జాబితాను ప్రకటించనుంది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్‌ల విభజన ప్రతిపాదనలు బయటకు పొక్కడంతో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్‌జైన్ అప్రమత్తమయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 26న ప్రారంభమై అక్టోబరు 4వ తేదీ ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్ సీఎం చంద్రబాబును కోరారు. కానీ ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో తానేమీ చేయలేనని సీఎం చేతులెత్తేయడంతో ఎంజీ.గోపాల్ డీలాపడ్డారు.

    తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనకు స్థానభ్రంశం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యూష్ కమిటీ ఈనెల 29 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్న నేపథ్యంలో తనను ఆంధ్రకే కేటాయించాలని సిద్ధార్థ్‌జైన్ ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తనను ఆంధ్రకే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును ఆయన కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ సిద్ధార్థ్‌జైన్ అభ్యంతరాన్ని ప్రత్యూష్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువ అని అధికారవర్గాలు వెల్లడించాయి.

    సీఎం కార్యాలయం అధికారులను ఆంధ్ర కేడర్‌కు కేటాయించేలా ప్రత్యూష్ కమిటీపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు అప్పట్లోనే సిద్ధార్థ్‌జైన్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కానీ సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రకు కేటాయించడానికి ప్రత్యూష్ కమిటీ అంగీకరించలేదన్నది ఐఏ ఎస్‌ల విభజనతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు ఒత్తిడి.. సిద్దార్థ్‌జైన్ ప్రతిపాదనను ప్రత్యూష్ కమిటీ తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా సెప్టెంబరు మొదటి వారంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్‌కు స్థానభ్రంశం తప్పదని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.
     

మరిన్ని వార్తలు