ఏడుగురికి షోకాజ్

1 Nov, 2013 03:17 IST|Sakshi
 
=బాధ్యత మరచిన సిబ్బందిపై పీవో కొరడా
 =నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కన్నెర్ర
 =మన్యంలో తొలి పర్యటనలోనే వినయ్‌చంద్ ముద్ర
 
హుకుంపేట, న్యూస్‌లైన్: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)అధిపతిగా బాధ్యతలు చేపట్టి ముందు కార్యాలయంపై దృష్టిసారించిన పీవో వినయ్‌చంద్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. విధుల్లోకి హాజరయినప్పటి నుంచి ఇంత వరకు సమీక్ష సమావేశాలతో బిజీగా ఉన్న పీవో మన్యంలో పర్యటన హు కుంపేట, పెదబయలుల్లో గురువారం ప్రారంభించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన అధికారులపై కన్నెర్ర చేశారు. రెండు మం డలాల్లో ఏడుగురికి షోకాజ్ నోటీసులివ్వాలని గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు. 
 
హుకుంపేట జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుల చేత రికార్డులు మోయించుకుని తీసుకువెళ్లారని తెలుసుకున్న పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. హుకుంపేట పీహెచ్‌సీని, అల్లంపుట్టు గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. పీహెచ్‌సీలో విధులకు హాజరు కాని ఇద్దరు వైద్యాధికారులు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో అల్లంపుట్టు పాఠశాలలోని ఇద్దరి ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు  షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలో ల్యాబ్, స్టోర్ రూం, పురిటిగది, డెంటల్ రూం వంటి ప్రతి విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు ఇచ్చే ఆహారపదార్ధాలను తనిఖీ చేశారు. స్టోర్‌రూంను, ఉపాధ్యాయుల తీరును, విద్యార్థుల రికార్డులను కూడా పరిశీలించారు. 
 
అనంతరం తీగలవలస పంచాయతీ బిజ్జాపల్లి ఆదివాసీ గిరిజన గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వాయుగుండం ప్రభావంతో తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను గ్రామస్తులు పీవోకు చూపించారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు అందడం లేదని, గ్రామంలో డ్రైనేజి లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సమ్మెకాలంలో నిలిచిపోయిన సిలబస్ త్వరితగతిన పూర్తి చేయాలని ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆదేశించారు. 
 
అన్ని ఆశ్రమాలకు గ్యాస్ పరఫరా చేస్తున్నా కర్రల పొయ్యిలలోనే వండటాన్ని ఆయన తప్పు పట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో రికార్డులను హెచ్‌ఎంలు, వార్డెన్‌లు నిర్వహించకపోవడం దారుణమని చెప్పారు. పాఠశాలల్లో రికార్డులు సక్రమంగా ఉండాలని, పరిశరాల పరిశుభ్రతను పరిరక్షించాలని ఆదేశించారు. కాఫీ మొక్కల పెంపకంలో ఉపాధి నిధుల స్వాహ, ప్రసుతం జరుగుతున్న పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. భారీగా సాగుతున్న రోడ్లు, భవనాలు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నామని చెప్పారు.  మన్యంలో అంకిత భావంతో పనిచేసిన నాడే ఆశించిన ఫలితాలు లభిస్తాయని సిబ్బందికి హితవు చెప్పారు.
 
 పెదబయలులో హెచ్‌ఎం, వార్డెన్‌లకు...
 
 పెదబయలు : ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ గిరిజన సంక్షేమ విద్యాలయాల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈమేరకు మండలంలోని తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు పట్టి, తరగతుల్లో ఉన్న బాలికల సంఖ్యను పరిశీలించారు. అనంతరం స్టాక్ రూంను పరిశీలించారు. సరుకుల నిల్వల్లో తేడాను గుర్తించారు. రికార్డుల నిర్వహణలో కూడా లోపాలు ఉండటంతో హెచ్‌ఎం, డిప్యూటీమెట్రిన్‌ల పనితీరును తప్పుబట్టారు. వీరిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు.  
 
మరిన్ని వార్తలు