ఆగ్రహ జ్వాలలు

25 Jul, 2014 02:21 IST|Sakshi
ఆగ్రహ జ్వాలలు

ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబుపై కన్నెర్ర చేశారు. చేస్తున్న మోసంపై పిడికిలి బిగించారు. రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని మాట తప్పిన చంద్రబాబు వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రైతులు, మహిళలు ఆయన దిష్టి బొమ్మలు దహనం చేశారు. ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ‘తమ్ముళ్లు’ తెగబడే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
 
సాక్షి, చిత్తూరు: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి ఆదుకుంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా మాట తప్పడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద మహిళలు, రైతులు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోటీగా నిరసనకు దిగారు.  

నరకాసురవధ పేరుతో చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చేందుకు యత్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా పార్టీ శ్రేణులు చంద్రగిరి వీధుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులను అనుసరించాయి. చూసేవాళ్లకు ఇద్దరూ కలిసి ఆందోళనలు చేస్తున్నారా? అనిపించింది. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకోవాలని కోరుతూ తహశీల్దార్ కిరణ్‌కుమార్‌కు చెవిరెడ్డి వినతిపత్రం అందజేశారు.

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు నినాదాలు చేసి, అనుచితంగా ప్రవర్తించారు. వారి తోపులాటలో తహశీల్దార్ కిందపడిపోయారు. వారిపై తహశీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ మురళిని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నారా రవినాయుడు అడ్డుకున్నారు. సీఐ చొక్కా కాలర్ పట్టుకుని ‘ఏయ్..నన్నెవరనుకున్నావ్..’ అంటూ విచక్షణారహితంగా ప్రవర్తించారు. చంద్రగిరి సీఐ నాగభూషణం సర్దిచెప్పారు.
 
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో నాలుగు కాళ్ల మంటపం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు పోటీ ఆందోళనకు దిగారు. చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

పలమనేరులో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో మండిపేటకోటూరు గ్రామంలో రైతులు, డ్వాక్రా మహిళలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని బార్లపల్లె వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అలాగే టౌన్‌బ్యాంక్ సర్కిల్‌లో డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ఆందోళనకు దిగారు. వీరికి ఎమ్మెల్యే తిప్పారెడ్డి సంఘీభావం తెలిపారు. నగరిలో ఉయ్యాలకాలువ వద్ద మహిళలు ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు.

పాలసముద్రం, జీడీనెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడుకండ్రిగ, నారాయణవనంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పుంగనూరులో లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు.  శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు, మహిళలు ధర్నా చేపట్టారు.
 
నేడు, రేపు కొనసాగనున్న ఆందోళనలు

చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడురోజుల పాటు ప్రతి పల్లె సీమలోనూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు శుక్ర, శనివారాలు కూడా  జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగనున్నాయి.
 
టీడీపీది గోబెల్స్ ప్రచారం

గంగాధరనెల్లూరు: తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలోనూ తన అనుకూల మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేయిస్తుందే తప్ప ఏ ఒక్క పనీ సక్రమంగా చేయడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణ స్వామి విమర్శించారు. గంగాధరనెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని తెలిపారు.

రైతులకు రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష మాఫీ చేస్తామని చెప్పినా అందులో ఎలాంటి స్పష్టతా లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ప్రకటన మేరకు సంఘంలోని ప్రతి మహిళకూ కేవలం రూ.5 వేలు మాత్రమే మాఫీ అవుతుందని చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే టీడీపీ నాయకులు స్వీట్లు పంచుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. లేకపోతే రెండుమూడు నెలల్లో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు.
 
నేడు పల్లెపల్లెలో ఆందోళనలు
 
రుణమాఫీ అమలులో ఆంక్షలను నిరసిస్తూ శుక్రవారం పల్లెపల్లెలో అందోళన కార్యక్రమాలు చేపట్టాలని నారాయణస్వామి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.
 

>
మరిన్ని వార్తలు