ఆ నలుగురు !

15 Mar, 2015 04:15 IST|Sakshi

బంధాలు, బంధుత్వాలు ఉన్న వారు మరణిస్తే వారి అంత్యక్రియలు బంధువులు, కుటుంబ సభ్యులు చేస్తారు. ఇది సాధారణం. మరి ఎలాంటి ఆదరణా లేకుండా.. అభాగ్యులుగా ఉండి చనిపోతే పరిస్థితి ఏమిటి ? భౌతిక కాయాన్ని ఎవరు తీసుకెళతారు..? అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? అంతిమ సంస్కారాలు నిర్వహించేదెవరు ? మృతులెవరో తెలియకుండా బరువు మోసేది ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ నలుగురు. చిత్తూరులో ఓ మహిళ, మరో ముగ్గురు కలిసి చేస్తున్న సేవల కథాంశం ఈ ఆదివారం ప్రత్యేకం...
 -చిత్తూరు (అర్బన్)
 
చనిపోయింది ఎవరో తెలియదు. ఎలాంటి బంధుత్వమూ ఉండదు. అయితేనేం.. మేమున్నామంటూ ఒకటవుతారు. చనిపోయిన అనాథలు, అభాగ్యులకు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తారు. అది కూడా తమతో బాగా కలిసిమెలిసి.. పరి చయమున్న వ్యక్తే చనిపోయినట్లు భావించి వారి ఆత్మ సైతం ఆనందపడేలా చేస్తారు. వాళ్లే చిత్తూరు నగరానికి చెందిన కంద, ధనలక్ష్మి, రామభద్ర, మధుబాబు. ఈ నలుగురి వృత్తులు వేర్వేరు. వీరితో పాటు రవీంద్రారెడ్డి, శిఖామణి, మురుగ, షణ్ముగం, వినాయగం, రమేష్ తదితరులు అందరూ ఒక్క చోటుకు చేరి ‘మాతృసేవా సమితి’ పేరిట ఓ చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనాథగా మృతిచెందిన వారిని గుర్తించి అంత్యక్రియలు చేయడమే వీరు ప్రవృత్తిగా చేసుకున్నారు. సంతపేటలో అనాథ శవాన్ని ఉంచి సొంత బంధువులా అంతిమ వీడ్కోలు పలికి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
 
ధనలక్ష్మి: బజారువీధిలో ఉన్న వినాయకుని గుడి పక్కనున్న సందులో పూల వ్యాపారం చేస్తుంటుంది. తొలుత కంద చేస్తున్న సేవలు విని తానూ అనాథ శవాల అంత్యక్రియల్లో పాలు పంచుకోవాలని సంకల్పించింది. అంత్యక్రియలకు, మృతదేహాన్ని తీసుకెళ్లే బండిని అలంకరించడానికి ఆమె పూలు ఇస్తున్నారు. ఇంకా అత్యక్రియలకు అవసరమైన మేరకు సాయపడుతున్నారు.
 
రామభద్ర: చనిపోయిన వారిని కొద్ది సేపు సంతపేటలోని మాతృ  సేవా సమితి కార్యాలయం వద్ద ఉంచుతారు. స్థానికులు ఇక్కడికి వచ్చి  మృతదేహం వద్ద నివాళులర్పిస్తారు. వాన, ఎండలో భౌతికకాయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రామభద్ర చర్యలు తీసుకుంటారు. తాను వ్యాపారానికి ఉంచుకునే షామియానాను మాతృసేవా సమితి కార్యాలయం వద్ద కాసేపు వేసి నలుగురికీ నీడ కల్పిస్తుంటారు.
 మధుబాబు: మృతదేహానికి సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లలో మధుబాబు ముందుంటారు. మహిళ చనిపోతే చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అందిస్తారు. పురుషులు చని పోతే పంచె, చొక్కా ఇతర వస్తువులు ఉచితంగా అందజేసి తోడ్పాటునిస్తున్నారు.
 
కంద: చిత్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కరుణాకర్ అనే కంద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. నగరంలో ఎక్కడ అనాథ శవం కనిపించినా సమాచారం కంద సెల్‌ఫోన్ (నెంబర్ -9391665281)కు వచ్చేస్తుంది. ఇలా ఫోన్ రాగానే అనాథ శవాన్ని ఓ బండిలో ఉంచుకుని పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దాదాపు దశాబ్దకాలంగా ఆయన చేస్తున్న సేవలకు స్నేహితులు, చుట్టుపక్కల వారు చేతులు కలిపారు. అనాథ శవాల అంత్యక్రియలకు తోచిన రీతిలో ఒక్కొక్కరు చేయూత అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు