రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం

18 Nov, 2014 03:32 IST|Sakshi
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమా
రామచంద్రాపురం(విస్సన్నపేట) : మెట్టప్రాంత రైతులకు రబీ సాగుకు సాగర్ జలాలను సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండలంలోని కలగర రామచంద్రాపురం గ్రామం వద్ద ఉన్న ఎన్‌ఎస్పీ 117 హెడ్ రెగ్యులేటర్ వద్ద సోమవారం ఆయన లాకులు ఎత్తి సాగర్ జలాలను నూజివీడు బ్రాంచ్ కెనాల్‌కు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం సాగుకు ఇబ్బంది పడకుండా సకాలంలో జోన్-3 కి సాగర్ జలాలు తీసుకువచ్చామన్నారు. మార్చి వరకు సాగర్ నీటి సరఫరా కొనసాగుతుందన్నారు.

రెండు రాష్ట్రాల రైతాంగానికి ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 13.4 టిఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. 20 టీఎంసీలు నిలుపుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. తాగు నీటికి ఇబ్బంది లేకుండా చెరువులు నింపేందుకు నీరు సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్తులో నీటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కృష్ణా లేదా, గోదావరి నీటిని  లిఫ్టు ద్వారా తీసుకొచ్చి చెరువులు నింపేందుకు ప్రతిపాదనలు తయారు చేసి తక్కువ ఖర్చు అయ్యేదాన్ని అమలు చేయటానికి చూస్తున్నామన్నారు. 13 లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

రైతులకు సంబంధించి బ్యాంకుల్లో మామిడి సాగు అని నమోదు చేయటంతో రుణ మాఫీ వర్తించడంలేదని పేర్కొంటూ మంత్రికి రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించి రుణమాఫీ తమను అర్హులుగా గుర్తించాలని వారు కోరారు. తెల్లదేవరపల్లి తండాకు లిప్టు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి మరో వినతి పత్రం అందజేశారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ, మెట్ట ప్రాంత రైతులకు సక్రమంగా సాగర్ జలాలు అందేలా చూడాలని కోరారు. సకాలంలో సాగర్ జలాలు జోన్-3 కు తీసుకు వచ్చేందుకు కృషి చేసినందుకు మంత్రి ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతిపాడు 1,2 లిప్టులు మోటార్లు పనిచేయక చెరువులు నింపుకోలేని పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు స్పందించి లిప్టు పనిచేసేలా చూడాలని కోరారు. మెట్ట ప్రాంత రైతులకు చివరి వరకు సాగర్ జలాలు అందించాలన్నారు. సాగర్ జలాలను వారబంది పద్ధతిన కాకుండా 15 రోజుల పాటు నిరంతరంగా ఒక జోన్‌కు, మిగతా 15 రోజులు మరో జోన్‌కు అందించేలా చూడాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. జోన్-3 ద్వారా నీరు అందిచటం వలన మెట్ట ప్రాంత రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

తుమ్మగూడెం వద్ద బ్రిడ్జి ఏర్పాటు అవసరమన్నారు. దీన్ని ఏర్పాటు చేస్తే రైతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో అవసరమైన చెరువులన్నింటిలో తాగునీటి సరఫరా కోసం సాగర్ జలాలు నింపుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం వనమహోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత, ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ వీరరాజు, పులిచింతల ఎస్‌ఈ చంద్రశేఖర్, ఈఈ కృష్ణారావు, డిఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు