గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు

20 Sep, 2013 15:00 IST|Sakshi

హైదరాబాద్:గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు రూ.280 కోట్లు కేటాయించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్ట్  విస్తరణకు రూ.280 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అమలవుతున్న పథకాలపై కూడా కేబినెట్ పెద్దలు చర్చించారు. అమ్మహస్తం పథకం రాష్ట్రంలో ఏవిధంగా అమలవుతుందనే అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. గిరిజన సంక్షేమశాఖలో 143 ట్రైబల్‌వెల్పేర్‌ ఆఫీసర్లు, 388 వార్డెన్‌ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఏడు కొత్త పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి 1000 కోట్ల రుణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్‌అండ్‌బీకు 468 కోట్లు,  పంచాయతీరాజ్‌కు 532 కోట్లు కేటాయించారు.
 

 

 ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి  చెందిన మంత్రులు గైర్హాజరయ్యారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి హాజరు కాలేదు.

మరిన్ని వార్తలు